Begin typing your search above and press return to search.

ఏపీలో అర్థరాత్రి వేళ.. అంగన్ వాడీల రచ్చ ఎంతలా ఉందంటే?

తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన అంగన్ వాడీలు.. సోమవారం ‘చలో విజయవాడ’ పేరుతో భారీ కార్యక్రమానికి తెర తీయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 5:46 AM GMT
ఏపీలో అర్థరాత్రి వేళ.. అంగన్ వాడీల రచ్చ ఎంతలా ఉందంటే?
X

తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన అంగన్ వాడీలు.. సోమవారం ‘చలో విజయవాడ’ పేరుతో భారీ కార్యక్రమానికి తెర తీయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంగన్ వాడీల పిలుపు మేరకు.. సోమవారం భారీ ఎత్తున నిరసన చేపట్టాలని భావిస్తున్న వారికి చెక్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగాయి. నిరసనకారులు విజయవాడకు చేరుకోకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేపట్టారు. వివిద జిల్లాల నుంచి విజయవాడకు అంగన్ వాడీలు చేరుకోకుండా ఉండేలా చెక్ పెట్టే క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

నిరసనకారుల్ని ఆదివారం అర్థరాత్రి నుంచే అదుపులోకి తీసుకోవటం షురూ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల నుంచి అంగన్ వాడీలు.. వారికి మద్దతుగా నిలిచే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం అర్థరాత్రి వేళ విజయవాడ ధర్నా చౌక్ వద్దకు భారీగా అంగన్ వాడీలు చేరుకొని నిద్రించటం గమనార్హం. వారికి మద్దతుగా నిలిచేందుకు మరింతమంది అంగన్ వాడీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరగా.. వారిని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మంది అంగన్ వాడీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. దీంతో.. వారుస్టేషన్ లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా కావలిలో రెండు బస్సుల్లో అంగన్ వాడీలు విజయవాడకు బయలుదేరగా.. వారిని గుర్తించినపోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బస్సుల్ని కావలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న అంగన్ వాడీలను అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన అంగన్ వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేయాలని భావించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలకుపిలుపునిచ్చారు. అయితే.. ఈకార్యక్రమాన్ని రెండు రోజుల్లో చేపట్టాలని భావించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల(విజయనగరం.. విశాఖ.. అనకాపల్లి.. పల్నాడు.. ప్రకాశం.. బాపట్ల.. అన్నమయ్య.. తిరుపతి.. నంద్యాల)కు చెందిన అంగన్ వాడీలు సోమవారం విజయవాడకు చేరుకోవాలని.. మిగిలిన జిల్లాల వారు మంగళవారం విజయవాడకు చేరుకోవాలని ప్లాన్ చేశారు. అయితే.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఎక్కడికక్కడ అరెస్టుల్ని చేయటంతో చలో విజయవాడ ఏ తీరులో సాగుతుందో చూడాలి.