Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్

ఈ పిటిషన్ పై తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఇంతకీ అంగళ్ల ఉదంతం ఏమిటి?

By:  Tupaki Desk   |   13 Oct 2023 6:03 AM GMT
బ్రేకింగ్: ఆ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్
X

ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు వస్తున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ కాలం తర్వాత ఒక ఊరట లభించింది. ఇప్పటికే స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాల్ని ఆశ్రయించటం.. ఎక్కడా ఊరట లభించకపోవటం తెలిసిందే. అదే సమయంలో ఆయనపై మరికొన్ని కొత్త కేసుల్ని తెర మీదకు వచ్చాయి.

అందులో అంగళ్ల ఘటన. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు చంద్రబాబుపై నమోదు చేసిన అంగళ్ల అల్లర్ల ఉదంతంపై స్పందించిన చంద్రబాబు.. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఇంతకీ అంగళ్ల ఉదంతం ఏమిటి? ఆ కేసులోని అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. తన ఉద్రిక్త ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే దుర్మార్గానికి చంద్రబాబు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్ల గ్రామానికి చంద్రబాబు పర్యటించటం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తన ప్రసంగాలతో టీడీపీ శ్రేణుల్ని చంద్రబాబు రెచ్చగొట్టటం వల్లే గొడవలు జరిగాయని.. పోలీసులపై దాడులు చోటు చేసుకున్నట్లుగా ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. ఈ ఉదంతంలో చంద్రబాబుతో సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబును ఏ1గా చేర్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 54 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

దాదాపు మూడు నెలల పాటు రిమాండ్ లో ఉన్న అనంతరం.. వారికి బెయిల్ లభించింది. ఇదే కేసులో చంద్రబాబుపై చర్యలకు పోలీసులు అడుగులు వేస్తున్న వేళ.. ఈ కేసులో తనపై తదుపరి చర్యలకు ముందుగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించటం.. అందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశించారు. ఇప్పటికే జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారన్న వార్తలు వస్తున్న వేళ.. అంగళ్ల కేసులో ఆయనకు బెయిల్ మంజూరై.. ఊరట లభించటం టీడీపీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.