Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!

ఈ సమయంలో రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి. పైగా ఆయా పార్టీలకు అవి చాలా ప్రిస్టేజ్ స్థానాలు కావడంతో పోరు మరింత హోరా హోరీగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 March 2024 6:24 AM GMT
హాట్  టాపిక్... ఏపీలో టాప్  8 నియోజకవర్గాలు ఇవే!
X

ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే ఆలస్యం.. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కిపోనున్నాయి! ప్రచార కార్యక్రమాలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కబోతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి. పైగా ఆయా పార్టీలకు అవి చాలా ప్రిస్టేజ్ స్థానాలు కావడంతో పోరు మరింత హోరా హోరీగా ఉంటుంది. ఈ సమయంలో అవి ఏయే నియోజకవర్గాలు.. వాటికున్న ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.!

పులివెందుల:

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. జగన్ అనే కాదు.. వైఎస్ కుటుంబానికే అది పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబాన్ని కొట్టినవారు లేరు, కొట్టబోయేవారూ లేరు అన్నంత ధీమా ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ కుటుంబ అభిమానులకు ఉంటుందనడంలో సందేహం లేదు. సో... ఇక్కడ వార్ ఎప్పుడూ వన్ సైడే!

అయితే... వైఎస్ వివేకానందరెడ్డి మరణం అనంతరం ఇటీవల కాలంలో పరిణామాలు చాలా మారాయని అంటున్నారు. పైగా ఇటీవల సునీత, షర్మిళలు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో... పులివెందులలో జగన్ ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారిన నేపథ్యంలో.. ఈ సారి ఈ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది.

కుప్పం:

చంద్రబాబు ఆక్రమించుకున్న కంచుకోట కుప్పం! ఇక్కడ ఆయన సుమారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సొంత నియోజకవర్గం చంద్రగిరి అయినప్పటికీ... కుప్పంలో ఆయన హవా 1989 నుంచి అవిరామంగా నడుస్తుంది. అయితే... అది బీసీల నియోజకవర్గం అని, దాన్ని ఆక్రమించుకుని చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని, ఇప్పటివరకూ ఆయనకు కుప్పమే అన్నీ ఇచ్చింది తప్ప, కుప్పానికి ఆయన చేసిందేమీ లేదని జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఫోకస్ మరింత పెరిగింది.

పైగా... ఈసారి కుప్పంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేస్తామని చెబుతున్న నేపథ్యంలో... కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రత్యక దృష్టిపెట్టారని.. ఆయన లక్ష్యం అదే అని అంటున్నారు. పైగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పటికే వైసీపీ బాబు & కో కి షాకిచ్చి ఉంది. దీంతో... ఈసారి కుప్పంపై రాష్ట్రవ్యాప్తంగా మరింత ప్రత్యేకత ఏర్పడే అవకాశం ఉంది!

మంగళగిరి:

రానున్న ఎన్నికల్లో హాట్ సీట్లలో మంగళగిరి ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ని వైసీపీ ఇక్కడ ఓడించింది. రానున్న ఎన్నికల్లోనూ లోకేష్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని జగన్ ఇప్పటికే పక్కా స్కెచ్ వేశారని చెబుతున్నారు. మరోపక్క విజయసాయిరెడ్డి అక్కడ మొహరించారని చెబుతున్నారు. ఈ దఫా కూడా చినబాబును మంగళగిరిలో ఓడించడం ఇప్పుడు వైసీపీ ముందున్న లక్ష్యాల్లో ఒకటని చెబుతున్నారు.

పిఠాపురం:

రానున్న ఎన్నికల్లో అత్యంత హాట్ సీట్ గా పిఠాపురాన్ని చెప్పుకోవచ్చు. రెండు రోజుల క్రితం తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ పవన్ ప్రకటన అనంతరం అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనను సంప్రదించకుండా పిఠాపురంలో పోటీచేస్తున్నట్లు పవన్ ప్రకటించారని వర్మ ఫీలవుతున్నారో ఏమో కానీ... మొన్న సపోర్ట్ చేస్తానన్న ఆయన, ఇంతకాలం నాన్చి నాన్చి చెప్పేసరికి అడ్డం తిరిగారు!

దీంతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి టీడీపీ నుంచి అందే సపోర్ట్ ఎంత అనేది కీలకంగా మారింది. ఇక వర్మ ఇండిపెండెంట్ గా వేస్తే పరిస్థితి మరింత దయణీయంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరోపక్క పవన్ ఏ కుల ఓట్లపై ఎక్కువ ఆధారపడ్డారని కథనాలొస్తున్నాయో... అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత ముద్రగడ వైసీపీలో చేరారు.

పైగా... పవన్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనేది వైసీపీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... పిఠాపురం వైపు రాష్ట్రం మొత్తం చూపు ఉంటుందనే భావించాలి! పైగా ఈ ఎన్నికలు పవన్ పొలిటికల్ కెరీర్ ను నిర్దేశించేవని చెబుతున్న నేపథ్యంలో... పిఠాపురం కచ్చితంగా ఈసారి హాట్ టాపిక్కే!

హిందూపూర్:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ 2014, 2019లో వరుసగా గెలిచిన నియోజకవర్గం హిందూపూర్. ఇది అంతక ముందు 1985 నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉంది. ఈ సమయంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య భావిస్తుంటే... ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ పథకాలు రచిస్తుంది. దీంతో బాలయ్య హ్యాట్రిక్ గురించి హిందూపుర్ హాట్ టాపిక్కే!

గుడివాడ:

అధినేతలకు అతీతంగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించే నియోజకవర్గాల్లో మొదటిది గుడివాడ అని చెప్పుకున్న అతిశయోక్తి కాదు! వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. గుడివాడలో కొడాలి నానీని ఓడించడం కూడా టీడీపీకి అంతే ముఖ్యంగా మారిపోయింది! దీంతో... చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కొడాలి నానిని గుడివాడలో ఓడించడం వారికి ఇప్పుడు అత్యంత ప్రిస్టేజ్ ఇష్యూ!

గన్నవరం:

చంద్రబాబు పులివెందులపై ఎంత శ్రద్ధ పెట్టారో తెలియదు కానీ... ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుడివాడతో పాటు అదేస్థాయిలో ప్రత్యేక దృష్టిపెట్టిన నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటి. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ జెండా మరోసారి ఎగరవేయడం అనేది బాబుకున్న లక్ష్యాల్లో ఒకటి. దీంతో... ఈ నియోజకవర్గంపైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది.

నగరి:

టీడీపీకి అసెంబ్లీలోనూ, బయటా కొరుకుడు పడని కొయ్యగా భావించే వైసీపీ నేతల్లో మంత్రి ఆర్కే రోజా ఒకరు! టీడీపీ నేతలపై.. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ లపై రోజా చేసే విమర్శలు వారిని మరింత ఇరుకునపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో... నగరిలో రోజాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని బాబు & కో భావిస్తున్నారు. మరోపక్క నగరిలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా కంకణం కట్టుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం కూడా స్పెషలే!