Begin typing your search above and press return to search.

ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయన్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 9:30 AM GMT
ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్‌ లా ఏపీ, తెలంగాణలా ఆంధ్రప్రదేశ్‌ విభజన జరగలేదన్నారు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందని గుర్తు చేశారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగా జరగలేదని గుర్తు చేశారు. ఈ విభజన ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలనూ సంతృప్తి పర్చలేకపోయిందన్నారు.

తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయన్నారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింది అని తెలిపారు. సోమవారం మొదలైన పార్లమెంటు సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరిగాయి. మంగళవారం నుంచి కొత్త పార్లమెంటు భవనంలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటు ఈ (పాత) పార్లమెంట్‌ భవనంలోనే జరిగిందని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌ సభలో ప్రసంగించారు. పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత భవనంలో పలు జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు.

అలాగే మాజీ ప్రధానుల సేవలను మోదీ పేరుపేరునా కొనియాడారు. పార్లమెంట్‌లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగం ఇప్పటికీ ప్రజాప్రతినిధులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. 'స్ట్రోక్‌ ఆఫ్‌ ది మిడ్‌ నైట్‌.. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ.. భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది' అన్న పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వరం మన చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతుందని చెప్పారు. 'ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఈ దేశం శాశ్వతం' అన్న మరో మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ మాటలు నిరంతరం మననంలోకి వస్తుంటాయని మోదీ వెల్లడించారు.

పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో వీడ్కోలు పలుకుతున్నందుకు ఉద్వేగంగా ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఈ పాత పార్లమెంటు భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేదని గుర్తు చేశారు. 75 ఏళ్లలో ఈ భవనం పలు చారిత్రక ఘట్టాలకు వేదికైందన్నారు. ఆర్టికల్‌ 370, జీఎస్‌టీ, ఒకే దేశం – ఒకే పింఛను వంటి కీలక బిల్లులను ప్రధాని మోదీ సభ్యుల దృష్టికి తెచ్చారు.

మనం కొత్త భవనంలోకి వెళ్లినా ఈ పార్లమెంటు భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందని మోదీ తెలిపారు. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని వెల్లడించారు. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని చెప్పారు.

రైల్వే ప్లాట్‌ ఫామ్‌ నుంచి వచ్చిన వ్యక్తి (ప్రధాని మోదీ) ఈ సభలో అత్యున్నత స్థానం పొందారని గుర్తు చేశారు. ఇది భారత ప్రజాస్వామ్య చేతనకు నిదర్శనమన్నారు. తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఈ భవనం గడపకు శిరస్సు వంచి నమస్కరించానని తెలిపారు. ఈ భవనం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని వెల్లడించారు.

భిన్నత్వానికి ప్రతీకైన ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఈ భవనం భాగస్వామ్యం కల్పించిందని మోదీ తెలిపారు. దళితులు, ఆదివాసీలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలకు ఈ సభ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఈ సభలో మహిళలు తక్కువ మంది ఉండేవారని.. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చిందన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో 7500 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. అలాగే 17 మంది స్పీకర్లు పనిచేశారన్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. ఇంద్రజిత్‌ గుప్తా 43 ఏళ్లపాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారన్నారు.