Begin typing your search above and press return to search.

ఏపీ నెంబర్ 1.. బ్యాంకు ఆఫ్ బరోడా సంచలన రిపోర్టు

By:  Tupaki Desk   |   21 April 2025 7:45 PM IST
ఏపీ నెంబర్ 1.. బ్యాంకు ఆఫ్ బరోడా సంచలన రిపోర్టు
X

అక్షర క్రమంలో అగ్రభాగాన నిలిస్తున్న ఆంధ్రప్రదేశ్.. ప్రగతి పథంలోనూ నెంబర్ వన్ ప్లేసుకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అత్యధిక ప్రైవేటు పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేశ్ కృషి ఫలించినట్లైంది.

దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంకు బరోడా సర్వే నిర్వహంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రాలను గుర్తించేందుకు చేసిన ఈ సర్వేలో ఏపీ ఫస్ట్ పొజీషన్ లో నిలిచింది. ఏపీ తర్వాత వరుసగా ఒడిశా, మహారాష్ట్ర రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక పాలసీలు తీసుకువచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నారు. దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారని బ్యాంకు ఆఫ్ బరోడా సర్వే తేల్చింది.

బ్యాంకు ఆఫ్ బరోడా నివేదికల ప్రకారం దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ 15.3% పురోగతి సాధించింది. ప్రముఖ కంపెనీలు అయిన టీసీఎస్, ఆర్సెల్లార్ మిల్టన్, గూగుల్, లులు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కోసం ప్రైవేటు పెట్టుబడులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. వెనువెంటనే అనుమతులు ఇస్తుండటంతో పారిశ్రామిక వేత్తలు సైతం ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తాన్నారని అంటున్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ ద్వారా చాలా కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అప్పట్లో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తిరిగి ఏపీలో అడుగు పెడుతున్నాయి. దీంతో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందు స్థానాన్ని ఆక్రమించిందని బ్యాంకు ఆఫ్ బరోడా తేల్చింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ ట్విటర్ లో సంతోషం వ్యక్తం చేశారు.