ఏపీలో గెలిచిన వారు.. ఓడిన వీరు.. ప్రజలే బేజారు.. !
మరికొన్ని చోట్ల అసలు కార్యాలయాలే ఓపెన్ చేయలేదు. ఇక, ఇంకొన్ని చోట్ల తమ అనుచరులను పెట్టి.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్నారు
By: Tupaki Desk | 23 April 2025 4:00 AM ISTప్రజలకు చేరువగా ఉండని నాయకుడు.. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు.. ఏమొహం పెట్టుకుని వస్తారు? కొంత కటువుగా ఉన్నా.. ఈ మాట రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. మరి ఈ మాట.. అందరికీ వర్తిస్తుందా? లేక.. కొందరికేనా? అంటే.. ప్రజల పరంగా చూసుకుంటే.. అందరికీ వర్తిస్తుంది. కానీ.. నాయకుల పరంగా చూసుకుంటే కొందరికే వర్తిస్తుంది. దీంతో ఇప్పుడు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
``ఓడిపోయిన వాళ్లను మేం అడగలేం. గెలిచిన మా నాయకుడు మాకు కనిపించడు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి`` అని.. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్నవారు చెబుతున్న మాట. మరికొన్ని చోట్ల అసలు కార్యాలయాలే ఓపెన్ చేయలేదు. ఇక, ఇంకొన్ని చోట్ల తమ అనుచరులను పెట్టి.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తప్ప.. వాటి పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదు.
ఇది.. అధికార పార్టీలకు చెందిన నాయకుల పరిస్థితి. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. అసలు నాయకులు కనిపించడమే లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజల మాట ఎలా ఉన్నా.. పార్టీ పెడుతున్న కార్యక్రమాలకు కూడా ఎవరూ హాజరు కావడం లేదు. దీంతో గెలిచిన వారు.. ఓడిన వారు కూడా.. ఒకే తరహా రాజకీయాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చోట్ల వైసీపీ నాయకులు.. అసలు లేకుండా పోయారు. ఎవరికి వారుగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఈ తరహా పరిస్థితిపై ప్రజల నుంచి తీవ్ర ఆవేదన, ఆక్రందన వ్యక్తమవుతోంది. ``ఔను. నిజమే.. ఇలా జరు గుతోంది. కానీ.. పరిస్థితిని మారుస్తున్నాం. ఎమ్మెల్యేలను కూడా.. బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తు న్నాం. దీనికి కొంత సమయం పడుతుంది`` అని టీడీపీనేత పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీలో అయితే.. ఈమాట కూడా ఎవరూ చెప్పడం లేదు. పైగా.. జగన్ చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇరు పక్షాల నాయకులపై ప్రజలు బేజారెత్తుతున్నారు.
