తెలుగు రాష్ట్రాల తెరచాటు 'జల' యుద్ధం.. బాబే కదలాలి!
అయితే.. గతంలో తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు.. సహకారం లోపించింది.
By: Tupaki Desk | 16 May 2025 6:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు, వివాదాలు కామన్‌గానే ఉన్నాయి. గతంలో రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు కూడా.. ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ.. ఇప్పుడు తార స్థాయికి చేరింది. ''ఏపీకి చుక్కనీరు కూడా ఇవ్వొద్దు. తాగడానికి కూడా ఇవ్వడానికి వీల్లేదు'' అని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. అంతేకాదు.. ఇదే చేయకపోతే.. తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తామని కూడా.. కృష్ణారివర్ బోర్డు మేనేజింగ్‌కు తేల్చి చెప్పింది.
అయితే.. గతంలో తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు.. సహకారం లోపించింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగాయి. ఆ తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరిన తర్వాత.. కష్టాలు.. నష్టాలు తగ్గుతాయని అందరూ అనుకున్నారు.కానీ, అప్పట్లోనూ కాళేశ్వరంపై జగన్, రాయల సీమ ఎత్తిపోతలపై కేసీఆర్ ప్రభుత్వం వివాదానికి దిగాయి. మొత్తానికి పదేళ్లు గడిచిపోయాయి.
ఇక, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నాయి. పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఆయన శిష్యుడేనని పిలిపించుకునే రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఒకసారి చర్చలు కూడా జరిగాయి. స్వయంగా చంద్రబాబు వెళ్లి హైదరాబాద్‌లో మీట్ అయ్యారు. ఆ తర్వాత.. జల వివాదాలను సామరస్య పూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే కమిటీని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
కానీ, ఏడు మాసాలు పూర్తయినా.. దీనిపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా.. ఇప్పుడు మరింత వివాదాలు తెరమీదికి వచ్చాయి. నాగార్జున సాగర్‌లో నీటిని చుక్క కూడా ఏపీకి ఇచ్చేది లేదని కనీసం తాగునీరు అవసరాలను కూడా తీర్చడానికి వీల్లేదని తెలంగాణ సర్కారు ముక్కుమీద గుద్దినట్టు కేఆర్ ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు)ను దాదాపు ఆదేశించినంత పనిచేసింది.
ఇదేసమయంలో ఏపీ కూడా.. అసలు తెలంగాణ తన వాటాను పూర్తిగా వాడేసిందని.. తనకు ఇలాంటి మాటలు మాట్లాడే హక్కులేదని.. అవసరమైతే.. సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పింది. కానీ.. ఇదే జరిగితే.. అటు తెలంగాణ, ఇటు ఏపీ కూడా ఇబ్బందులు పడతాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఒక మెట్టు దిగి.. చర్చలకు వస్తే తప్ప.. సమస్య పరిష్కారం కాదని అంటున్నారు నిపుణులు. మరి ఏం చేస్తారో చూడాలి. పంతానికి పోవడం రెండు రాష్ట్రాలకూ సరికాదని కూడా చెబుతున్నారు.
