తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పొలిటికల్ సీన్!
విడిపోయి కలిసి ఉందామన్న రాష్ట్ర విభజన ఉద్యమం వేళ బలంగా వినిపించినా నినాదం.. రాష్ట్రాలుగా తెలుగు నేల విడిపోయిన తర్వాత కనిపించిందా? లేదా? అన్నది తెలుగు ప్రజలకు చాలా బాగానే తెలుసు.
By: Tupaki Desk | 30 May 2025 10:19 AM ISTవిడిపోయి కలిసి ఉందామన్న రాష్ట్ర విభజన ఉద్యమం వేళ బలంగా వినిపించినా నినాదం.. రాష్ట్రాలుగా తెలుగు నేల విడిపోయిన తర్వాత కనిపించిందా? లేదా? అన్నది తెలుగు ప్రజలకు చాలా బాగానే తెలుసు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజనకు ముందు మాదిరే.. విభజన తర్వాత ఏదైనా సంచలన అంశాలు చోటు చేసుకున్నప్పుడు.. వాటికి సంబంధించిన ఆసక్తి రెండు రాష్ట్రాల్లోనూ వ్యక్తమయ్యేది. అది చంద్రబాబు అరెస్టు కావొచ్చు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టటం కావొచ్చు. చివరకు లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు విషయంలో తెలంగాణ ప్రజానీకం పెద్దగా స్పందించింది లేకున్నా.. అందుకు భిన్నంగా ఏపీలో భారీ చర్చనే నడిచింది.
రాజకీయంగానే కాదు.. నేరాలు.. ఘోరాలకు సంబంధించిన అంశాలు తెలంగాణలో చోటు చేసుకున్నా.. ఆంధ్రాలో జరిగినా.. దానికి సంబంధించిన చర్చ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కనిపించేది. మొత్తంగా తెలుగు ప్రజల ఆసక్తి ఒకేలా ఉండేదన్న భావన వ్యక్తమయ్యేది. అందుకు భిన్నంగా రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఒక అంశంలో మాత్రం భిన్నమైన సీన్ కనిపించటం ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కవిత.. ఇటీవల కాలంలో చేస్తున్న సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ను బీజేపీలోకి కలిపేందుకు కుట్ర జరిగిందన్న సంచలన వ్యాఖ్యలు ఏవీ కూడా ఏపీ ప్రజల్ని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. తొలిసారి తెలంగాణ రాజకీయం తెలంగాణకు పరిమితం కాగా.. అదే సమయంలో ఏపీలోని రాజకీయం ఏపీకే పరిమితమైన సిత్రమైన ద్రశ్యం కనిపించిందని చెబుతున్నారు.
కవిత చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఎలాంటి చర్చ జరగటం లేదు సరికదా. .రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి వ్యక్తం కాకపోవటం విశేషం. అదే సమయంలో కడప వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వ్యవహారం కూడా తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్నది లేదు. తెలంగాణ సమాజం తమకు సంబంధం లేని కార్యక్రమంగా మహానాడును చూసింది. ఇలాంటి సీన్ ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పొలిటికల్ సీన్ ఉన్న వేళలో.. వాటికి సంబంధించిన చర్చ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుంది. కానీ.. ఈసారి మాత్రం విభజన స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. తెలుగు నేల రాష్ట్రాలుగా రెండు ముక్కలైన తర్వాత తొలిసారి.. విభజన ఎఫెక్టు ప్రజల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.
