మంత్రుల ముచ్చట.. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల వ్యవహారం.. తరచుగా చర్చకు వస్తూనే ఉంది.
By: Tupaki Desk | 28 Jun 2025 9:00 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల వ్యవహారం.. తరచుగా చర్చకు వస్తూనే ఉంది. అయితే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నట్టుగా రెండు రాష్ట్రాల్లోనూ మంత్రుల వ్యవహారంలో తేడాలు ఉన్నా.. పద్ధతి మాత్రం ఒక్కటే అన్నట్టుగా ఉంది. ఏపీ విషయాన్ని తీసుకుంటే.. సీఎం చంద్రబాబుపై మంత్రులు ఎవరూ కామెంట్లు చేయరు. కానీ, తెరచాటున మాత్రం వారు చేయాలనుకున్నదే చేస్తున్నారు. అధినేత మాట వింటారు. కానీ, వారు ఏం చేయాలని తలపోస్తే అదే చేస్తున్నారు.
ఉదాహరణకు .. ప్రజల్లో ఉండాలని చంద్రబాబు చెబితే.. ఓకే అంటారు. కానీ.. ప్రజల్లోకి వెళ్లినట్టే వెళ్లి సొంత పనులు చక్కపెట్టుకునే వారు 15 మంది వరకు ఉన్నారు. ఇది టీడీపీ లెక్క. మరి చంద్రబాబు మాట వినడం లేదా? అంటే.. వింటున్నారు. మీడియా ముందుకు వచ్చి వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తారు. నియోజకవర్గానికి వెళ్తున్నట్టుగా వెళ్లి.. సొంత ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు తీసుకుని.. వాటిని సోషల్ మీడియాకు ఇచ్చి.. ప్రచారం చేస్తున్నారు.
తద్వారా అధినేత కళ్లకు చక్కటి గంతలు కడుతున్నారు. మరి ఈ విషయం చంద్రబాబుకు తెలిసో తెలియదో కానీ.. జరగాల్సింది జరిగిపోతోంది. ప్రజాదర్బార్‌ల పేరిట వారం వారం తమ తమ నియోజకవర్గాల్లో ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఉండడమే కదా! అనుకుంటున్న నాయకులు అలానే చేస్తున్నారు. కానీ, సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. తాజాగా విశాఖ, తూర్పు, అనంతపురం జిల్లాల్లో కీలక మంత్రులకు ప్రజల నుంచి భారీ సెగ తగిలింది. తాము సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. పరిష్కారం కాలేదని.. ధర్నాలుచేశారు.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. అంతర్గత కుమ్ములాటలు మంత్రుల పేషీల్లోనే జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తున్నవారు కనిపిస్తున్నాయి. ఇది తప్పుకాదని కూడా వారు సమ ర్థించుకుంటున్నారు.తమది అతి పెద్ద.. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని చెప్పుకొంటున్నారు. తాజాగా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్‌ను కలిసిన హైదరాబాద్‌కు చెందిన మంత్రి ఒకరు.. సీఎంపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇది బయటకు రాకుండా ఆమె రెండు రోజులు తొక్కి పెట్టారు. కానీ, దాగలేదు.
పోనీ.. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు మంత్రులు వింటున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకోవద్దని అంటున్నా.. ఎవరూ చెవిన పెట్టడం లేదు. కొండా సురేఖ శాఖలో ఓ మంత్రి వేలు పెట్టారు. ఇదే.. అసలు వివాదానికి కారణమని లేటుగా తేలింది. ఇలా.. మంత్రులు ఎవరికి నచ్చిన రీతిలో వారు ఉంటున్నారు. మరొకరు.. గౌడ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆ వర్గాన్ని రెచ్చగొట్టి సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు పంపించారు. ఇలాంటి పరిణామాలతో ఇరు రాష్ట్రాల్లోనూ మంత్రుల వ్యవహారం రోజుకోరచ్చగా మారుతోంది.
