తెలుగు రాష్ట్రాల ఆదాయం పెరుగుతోంది.. ఇదిగో ఇలా..!
ఏపీ విషయానికి వస్తే.. 2024తో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 700 కోట్ల రూపాయల మేరకు ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.
By: Tupaki Desk | 2 Sept 2025 3:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల ఆదాయం పెరుగుతోంది. ప్రధానంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మరింత పుంజుకుంది. దీంతో రెండు రాష్ట్రాలకు కూడా వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. దీని ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఆదాయం గత నెలలో పుంజుకుందని వివరించింది. అంతేకాదు.. 2024 , ఆగస్టుతో పోల్చుకుంటే.. ఈ ఏడాది మరింతగా ఆదాయం పెరిగినట్టు వివరించింది. దీంతో రెండు రాష్ట్రాలకు కూడా.. మేలు జరుగుతుందని.. వాటాలు కూడా పెరుగుతాయని పేర్కొంది.
ఏపీకి ఎంత పెరిగింది?
ఏపీ విషయానికి వస్తే.. 2024తో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 700 కోట్ల రూపాయల మేరకు ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. 2024లో జీఎస్టీ రూపంలో 3298 కోట్ల రూపాయలు వసూలైందని, ఈ ఏడాది ఆగస్టు మాసంలో ఇది.. 3989 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. అంటే.. సుమారు 700 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం పెరిగిందని వివరించింది. ఇది.. అన్ని రకాలుగా రాష్ట్రానికి దోహద పడుతుందని పేర్కొనడం గమనార్హం.
తెలంగాణలో..
తెలంగాణకు వచ్చేసరికి జీఎస్టీ ఆదాయంలో 12 శాతం మేరకు ఆదాయం వృద్ధి చెందినట్టు కేంద్రం వివరించింది. గత 2024 ఆగస్టులో 4,569 కోట్ల రూపాయలు తెలంగాణకు లభించగా.. ఈ సారి అది 5,103 కోట్లకు చేరినట్టు పేర్కొంది. మొత్తంగా 600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా లభించాయని వివరించింది.
ఇక, రెండే శ్లాబులు!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక శాఖ వివరించింది. ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీని ఇక, నుంచి రెండు శ్లాబులుగా వర్గీకరించనున్నట్టు వివరించింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం ఉండగా.. ఇక, నుంచి కేవలం 5, 18 శాతం శ్లాబులే ఉండనున్నాయని పేర్కొంది. ఇవి వచ్చే దీపావళికి ముందుగానే అమలు కానున్నట్టు వివరించింది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.
కేంద్రం ఆదాయం కూడా..
జీఎస్టీవిషయంలో రాష్ట్రాలు పుంజుకున్న నేపథ్యంలో కేంద్రానికి కూడా ఆమేరకు ఆదాయం గణనీయంగా పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. గత ఏడాది జూన్‌లో.. 1.96 లక్షల కోట్ల రూపాయలు రాగా.. ప్రస్తుతం ఈ ఏడాది 1.98 లక్షలకు చేరినట్టు వివరించింది. దీంతో 6.5 శాతం మేరకు పెరుగుదల నమోదైనట్టు వివరించింది. గత ఏప్రిల్‌లో జీఎస్టీ చరిత్రలో అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్ల మేరకు వచ్చినట్టు పేర్కొంది.
