జగన్ ట్రాప్‌లో కూటమి సర్కారు.. ఏం జరిగింది..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో వెనుకబడిందని.. అదే జగన్ అయితే.. ఆదాయాన్ని సంపాయించారని.. పథకాలను అమలు చేశారని చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 19 May 2025 9:00 PM ISTరాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగిందని.. జగన్ హయాం కంటే కూడా.. తమ ప్రభుత్వం పన్నులు, సిస్తు.. ఇతర ఎగుమతుల విషయాల్లో దూకుడుగా ఉందని కూటమి ప్రభుత్వమే తాజాగా లెక్కలు సహా వివరించింది. జగన్ మీడియా కావొచ్చు.. వైసీపీ నాయకులు కావొచ్చు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడం లేదని.. జగన్ హయాంలో వచ్చిన రాబడి రావడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. గతాన్ని ప్రస్తుతాన్ని కూడా పోల్చారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు.. కాదు.. గత ఆరు మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిందంటూ.. పెద్ద ఎత్తున లెక్కలు వండి వార్చింది. ఈ విషయాలు గణాంకాలతో సహా.. సర్కారు అనుకూల మీడియాలోనే వచ్చాయి. అయితే.. ఇక్కడే పెద్ద సమస్య ఎదురైంది. వ్యూహాత్మకంగా జగన్ ట్రాప్‌లో సర్కారు పడిపోయింది. వాస్తవానికి వైసీపీ నాయకులు.. జగన్ కూడా.. సర్కారును ఇరుకున పెట్టాలన్న వ్యూహంతోనే సదరు లెక్కలు వండివార్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో వెనుకబడిందని.. అదే జగన్ అయితే.. ఆదాయాన్ని సంపాయించారని.. పథకాలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంటే సరిపోయేది. కానీ.. ఇక్కడే సంపద పెరిగిందని, జగన్ కంటే ఎక్కువగానే సంపద పెంచుతున్నామని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే వైసీపీ మరో వ్యూహం పన్నింది. మరి సంపద పెరిగినప్పుడు.. సూపర్ సిక్స్‌ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది.
ఈ పరిణామం.. ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని.. వ్యవస్థలను బాగు చేసే పనిలో ఉన్నామని.. అందుకే సూపర్ సిక్స్‌ను అమలు చేయడం కష్టంగా మారిందని.. ఇటీవల కర్నూలులోనూ వ్యాఖ్యానించారు. ఆ తదుపరి వారంలోనే వైసీపీ ట్రాప్ చేసింది. దీనిలో పక్కాగా కూటమి సర్కారు ఇరుక్కుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా.. సంక్షేమం ఇవ్వడం లేదన్న చర్చ ప్రారంభమైంది.
ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఇప్పుడు పథకాలు అమలు చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అలా కాకుండా.. ఉంటే.. మరో ఆరు మాసాలైనా జనం సూపర్ సిక్స్ గురించి పెద్దగా ఆలోచించే వారు కారని.. అప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం దక్కి ఉండేదని పరిశీలకులు, పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.
