కొత్త జడ్పీ చైర్మన్లకు కుర్చీల సమస్య.. 15 జడ్పీలకు భవనాలు ఏవీ?
ఇక పాత జిల్లా పరిషత్తులకు అన్నిరకాల హంగులతో కార్యాలయాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్తుల విషయంలోనే గందరగోళం నెలకుందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 26 Sept 2026 2:00 PM ISTఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లా పరిషత్ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 13 జిల్లా పరిషత్తులు ఉండగా, వీటిని 28 జిల్లా పరిషత్తులుగా విభజించాల్సివుంది. ఇక పాత జిల్లా పరిషత్తులకు అన్నిరకాల హంగులతో కార్యాలయాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్తుల విషయంలోనే గందరగోళం నెలకుందని అంటున్నారు. కొత్తగా 15 జిల్లా పరిషత్తు కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సివుండగా, పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరం, అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు, మార్కాపురం, మదనపల్లె వంటి కొత్త జిల్లాల్లో జడ్పీలకు సరిపడా భవనాల కొరత ఉందని అంటున్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వంలోనే 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో జిల్లాల సంఖ్య 28కి చేరిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో జిల్లాలు ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్తుల విభజన మాత్రం చేయలేదని చెబుతున్నారు. దీనికి కారణం జిల్లాల ఏర్పాటుకు ముందే వాటికి పాలక వర్గాలు ఉండటం వల్ల సాధ్యం కాలేదని చెబుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం పదవీకాలం ఉండగా, వాటిని విభజించలేని పరిస్థితి ఉండటంతో దాదాపు నాలుగున్నరేళ్లుగా కొత్త జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లా పరిషత్తుల పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు జడ్పీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు.
రెండు రోజుల క్రితం పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తు కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. కొత్త జడ్పీలకు అధికారుల బదిలీని మొదలుపెట్టిందని అంటున్నారు. అయితే ఇంకా ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో జరగలేదని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తుండటం వల్ల వచ్చే నెల, నెలా 15 రోజులకల్లా కొత్త కార్యాలయాలు, సిబ్బంది బదిలీ చేయాల్సివుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల జిల్లా కేంద్రాలుగా ఉన్న పట్టణాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలు లేవని చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ కొత్త కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జడ్పీల విభజన తర్వాత సిబ్బంది ఎక్కడ కూర్చోవాలన్న అంశం కూడా పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.
వచ్చేనెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ముందుగా కొత్త జిల్లాల్లో జడ్పీలకు భవనాలు సమకూర్చే విషయమై దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జిల్లాల విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సులు నిర్మాణంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలలో చాలా కార్యాలయాలు ప్రైవేటు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటు అయ్యే జడ్పీ కార్యాలయాలకు కూడా ప్రైవేటు భవనాలే దిక్కుగా చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత కొలువుదీరే జడ్పీ చైర్మన్లకు ఎక్కడ కూర్చోబెడతారనేది కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా కేబినెట్ ర్యాంకుతో కొత్త బాధ్యతలు చేపట్టే జడ్పీ చైర్మన్లు పదవులతోపాటు కుర్చీలు కూడా తమ వెంటే తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
