Begin typing your search above and press return to search.

ఏపీలో ‘సర్’.. పార్టీల జాతకాలు తారుమారు చేస్తుందా? టెన్షన్ లో నేతలు

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్) త్వరలో మొదలుకానుంది. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14తేదీ వరకు ఓటర్ల జాబితాను పరిశీలించేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరగనున్నారు.

By:  Tupaki Political Desk   |   4 Jun 2026 7:00 PM IST
ఏపీలో ‘సర్’.. పార్టీల జాతకాలు తారుమారు చేస్తుందా? టెన్షన్ లో నేతలు
X

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్) త్వరలో మొదలుకానుంది. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14తేదీ వరకు ఓటర్ల జాబితాను పరిశీలించేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరగనున్నారు. వలస వెళ్లినవారి ఓట్లతోపాటు డ్యూప్లికేట్, డెత్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమం రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు సర్ పూర్తి చేసిన రాష్ట్రాల్లో పార్టీల జాతకాలు తారుమారు కావడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి.

ఈ నెల 15 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. నెలరోజుల పాటు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించనున్న అధికారులు వచ్చేనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిశీలన అనంతరం సెప్టెంబరు 22న తుది జాబితాను విడుదల చేస్తారు. స్థానిక ఎన్నికల ముందు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రక్రియ రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ముఖ్యంగా విపక్ష వైసీపీ సర్ పై అప్రమత్తంగా ఉండాలని కేడర్ ను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది వైసీపీ.

సర్ లో నిజమైన ఓటు ఏ ఒక్కటీ తొలగించకుండా పార్టీ కేడర్ జాగ్రత్తగా ఉండాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఇప్పటికే సూచించారు. సర్ లో భారీగా ఓట్లు తొలగించడం వల్ల బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అధికారం కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో విపక్షంలో ఉన్నందున వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించే కుట్ర జరగొచ్చని సందేహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సర్ విధానంపై కేడర్ కు శిక్షణ పూర్తి చేశారు.

ఇదే సమయంలో అధికార టీడీపీ సైతం సర్ పై పూర్తిగా ఫోకస్ చేసిందని అంటున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని పార్టీ కేడర్ కు టీడీపీ హైకమాండ్ సూచనలు చేస్తోందని చెబుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీలకు శిక్షణ ఇస్తూ సర్ లో ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశాలపై సూచనలు, సలహాలిస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో రాష్ట్రంలో సర్ ప్రారంభానికి 15 రోజుల ముందే రాజకీయంగా వేడి పెరిగిపోయిందని అంటున్నారు. సర్ ప్రక్రియ వల్ల బెంగాల్ లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రాన్ని 15 ఏళ్లు పాలించిన మమత బెనర్జీ తట్టాబుట్టా సర్దుకోవడం దేశంలో ఇతర పార్టీలకు ఓ హెచ్చరికగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తమిళనాడులో సైతం డీఎంకే అధికారం కోల్పోయిన తీరు విపక్ష పార్టీలను భయపెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో అధికార టీడీపీ కన్నా, విపక్ష వైసీపీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు.