ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాల్సిందే !
ఈ సర్వే ప్రభుత్వం చేపట్టడం వెనక మంచి ఉద్దేశ్యం ఉంది అన్ చెబుతున్నారు. అదేంటి అంటే ప్రతీ కుటుంబానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం పూర్తి కచ్చితత్వంతో ప్రభుత్వం కోరుకుంటోంది.
By: Satya P | 8 Jan 2026 11:30 AM ISTఅవును ఏపీలోని ప్రతీ కుటుంబం కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పల్సిందే. లేకపోతే ఏమిటి అంటే మీరే ఇబ్బందులు పడతారు అని అంటున్నారు. సంక్షేమ పథకాలు కానీ లేదా ఏ ఇతర ప్రయోజనాలు కానీ అందుకోవడం కష్టంగా మారుతుంది అని అంటున్నారు. ఇంతకీ ఏమా ప్రశ్నలు ఎవరు సంధిస్తారు, ఎందుకు జవాబు చెప్పాలి అంటే అక్కడే విషయం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్రెష్ గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను చేపడుతోంది. ఈ సర్వేలో ప్రతీ కుటుంబం తప్పనిసరిగా పాలుపంచుకోవాలని కోరుతోంది. దీని వల్ల పధకాలు మరింత పారదర్శకంగా అందుతాయని అంతే కాకుండా ప్రభుత్వ సేవలు కూడా ఇంకా వేగవంతంగా వారు పొందే వీలు ఉంటుందని చెబుతున్నారు.
ఇందుకోసమే సర్వే :
ఈ సర్వే ప్రభుత్వం చేపట్టడం వెనక మంచి ఉద్దేశ్యం ఉంది అన్ చెబుతున్నారు. అదేంటి అంటే ప్రతీ కుటుంబానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం పూర్తి కచ్చితత్వంతో ప్రభుత్వం కోరుకుంటోంది. ఇలా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కలెక్ట్ చేసిన పూర్తి డేటా వల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన సరైన లబ్దిదారులకు చేరుతాయని అంటున్నారు. ఇందులో డూప్లికేషన్ ని తొలగించడం కీలక ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అంతే కాకుండా అనర్హులు ఎవరైనా ఉన్నా లేక గతంలో వచ్చి ఇపుడు రాకపోయినా ఆ తప్పిదాలను సరిచేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదే విధంగా ప్రతీ కుటుంబానికి సంబంధించిన ఒక సమగ్రమైన డేటాను ప్రభుత్వం రూపొందిస్తుంది అని చెబుతున్నారు. జీఎస్ డబ్ల్యూ ఎస్ ద్వారా సంక్షేమ పథకాలను మరింత సులువుగా అమలు చేయడానికి వీలు అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రణాళికలకు విధానం అమలుకు తగిన మద్దతుగా కూడా ఈ సర్వే చేపట్టడం జరుగుతోంది అని అంటున్నారు.
ఈ వివరాలు అన్నీ :
ఇక ఈ సర్వేలో ప్రధానంగా కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారు, అలాగే వారి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటారు, ఆధార్ అనుసంధానం తో పాటు వ్యక్తిగత సమాచారం కూడా కలెక్ట్ చేస్తారు. నివాస పరిస్థితి కూడా తెలుసుకోవడం ప్రస్తుతం వారు పొందుతున్న సౌకర్యాలు కూడా అంచనా వేయడం జరుగుతుంది. అలాగే విద్య, వృత్తి ఆ కుటుంబం ప్రస్తుతం ఉపాధి వంటివి కూడా సర్వేలో సేకరిస్తారు.
సచివాలయ సిబ్బందితో :
ఈ సర్వేను వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా సేకరిస్తారు. వారే ప్రతీ ఇంటికీ వెళ్ళి సర్వే చేయడం ద్వారా మొత్తం డేటాను కలెక్ట్ చేస్తారు, అలాగే ఆధార్ ఆధారిత ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తారు. ఈ మొత్తం సర్వే కార్యక్రమాన్ని ఎంపీడీఓలు, జోనల్ కమిషనర్లు, జిల్లా అధికారులు ఆయా స్థాయిలలో పర్యవేక్షణ చేస్తారు.
తప్పనిసరిగా పాల్గొనాలి :
ఇక ఈ సర్వేలో ప్రతీ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనాలని సర్వే సిబ్బందికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. సరైన పూర్తి సమాచారం అందించాలని వినతి చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా ధృవీకరించాలి, ఎటువంటి పొరపాట్లు జరిగి ఉంటే వెంటనే సచివాలయానికి వెళ్ళి తెలియచేయాలని సరిచేసుకోవాలని కోరుతున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని పధకాల అమలు కోసం పాలన కోసమే ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద ఈ సర్వే అన్నది ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
