హోమ్ స్టేలతో టూరిజం...కూటమి ప్రయోగం
ఏపీ ప్రభుత్వం పర్యాటకులు ఎక్కువగా పెరిగేలా యాక్ష ప్లాన్ ని రెడీ చేస్తోంది. అందుకే బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధి చేస్తోంది.
By: Satya P | 26 March 2026 12:00 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చాలా రాష్ట్రాలు దేశాల బడ్జెట్ కి ఎంతో ఆదాయం టూరిజం మీదనే వస్తోంది. ఏపీ అన్నది తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. భౌగోళికంగా కలసి వచ్చే అంశగా ఇది ఉంది. దాంతో పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ ఏపీని టూరిజం హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సీరియస్ గానే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హోమ్ స్టేల కల్చర్ ని కూడా అందుబాటులో విరివిగా ఉంచే ప్రయత్నం చేస్తోంది.
హోమ్ స్టే అంటే ఏమిటి :
అసలు కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగా హోమ్ స్టే అంటే ఏమిటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. నిజానికి ఇది ఒక రకమైన వినూత్న ఆతిధ్యం, సంప్రదాయాన్ని కలబోసిన తీరులో సాగే ఆతిధ్యం. పర్యాటకులు తాము పర్యటించే ప్రాంతంలోని స్థానికుల ఇళ్ళలో బస చేస్తారు. అలా వారి ఇంట్లోనే వారితో కలసి నివాసాన్ని పంచుకుంటారు. దాని వల్ల వారికి స్థానికంగా మరింతగా సమాచారం తెలుస్తుంది. హోమ్ సిక్ నెస్ పోతుంది. పర్యాటకానికి సంబంధించి కొత్త విషయాలు గైడ్ అవసరం లేకుండా తెలుసుకోగలుగుతారు. ఇంట్లో ఉన్నట్లుగానే హాయిగా ఉండొచ్చు. దానికి గానూ వారు కొంత మొత్తం ఆ ఇల్లు ఇచ్చిన వారికి చెల్లించవచ్చు. ఇలా ఉభయులకు ఎంతో కలసివచ్చేలా ఈ హోమ్ స్టేల విధానం ఉంటుంది.
ఏజెన్సీలో మొదలు :
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో హోమ్ స్టేలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ హొటళ్ళు రెస్టారెంట్లు పెద్దగా ఉండవు. అందుకే స్థానికంగా వారి ఇళ్లలో బస చేస్తూ ప్రకృతి అందాలని తిలకిస్తూ వారి నుంచి సమాచారం తెలుసుకుంటూ గొప్ప అనుభూతిని పొందుతారు. ఇక నగరాల్లో అయితే హొటొళ్ళు, లాడ్జీలలో రెస్టారెంట్లలో దిగి టూరిస్టులు టూర్లు చేస్తారు. అయితే ఏపీలో ఇపుడు ఉన్న హొటళ్ళు సరిపోవని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులు ఎక్కువ మంది వస్తే వారిని ఆకర్షించేందుకు హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహిస్తోంది.
బడ్జెట్ టూరిజం :
హోమ్ స్టేల పాలసీతో బడ్జెట్ టూరిజానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు తక్కువగా అవుతుంది. నగరాలలో హొటళ్ళకు పెద్ద ఎత్తున ఖర్చు చేసే కంటే స్థానిక ఇళ్ళలో బస చేయడం వళ్ల బడ్జెట్ సేవ్ అవుతుంది. అంతే కాదు, స్థానికులతో పరిచయం పెంచుకునే అవకాశాన్ని హోమ్ స్టేలు కల్పిస్తాయి. హోమ్ స్టేలు స్థానిక జీవిత విధానాన్ని అధ్యయనం చేసేందుకు వారు సంస్కృతి అక్కడి విషయాలను మరింత లోతుగా తెలుసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే హోమ్ స్టేలు ఇంటి వాతావరణాన్ని అందించడమే కాకుండా హోటల్‌లో బస చేయడంతో పోలిస్తే వాటి ఖర్చులు గణనీయంగా తక్కువగా ఉంటాయి. పర్యాటకులు తాము పర్యటించే నగరాలలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటే, హోమ్‌స్టే సరైన ఎంపికగా చెబుతారు.
పర్యాటకులు పెరిగేలా ప్రణాళికలు :
ఏపీ ప్రభుత్వం పర్యాటకులు ఎక్కువగా పెరిగేలా యాక్ష ప్లాన్ ని రెడీ చేస్తోంది. అందుకే బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధి చేస్తోంది. అంతే కాదు పర్యాటకుల కోసం హోటళ్లు హోమ్ స్టేలు పెంచేలా పధక రచన చేస్తోంది. కారావాన్ పార్కులని, టెంట్ సిటీల ఏర్పాటుని కూడా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల తాకిడి తట్టుకునేందుకు అనుగుణంగా 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అలాగే వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10 వేలకు పైగా హోమ్ స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు.హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపై ఎలాంటి పరిమితీ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాల నుంచే :
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలతో పాటు నగరాలలో జాతీయ అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వచ్చేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోమ్ స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. హోమ్ స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీ వనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం పది నుంచి పదిహేను ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హెలీ టూరిజంతో పాటుసీ ప్లేన్‌లు :
ఇదిలా ఉంటే గండికోట సూర్యలంక అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణని కూటమి ప్రభుత్వం చేపడుతోంది. హౌస్ బూట్లు, హెలీ టూరిజంతో పాటు ఉడాన్ పథకం కింద సీ ప్లేన్‌లను కూడా ప్రోత్సహించాలని చూస్తోంది. అలాగే, విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం అవుతోంది.
