టెంపుల్ సిటీస్ లో హోమ్ స్టేలు, టూరిజం స్పాట్స్ లో టెంట్ సిటీలు.. ఏపీలో నయా టూరిజం
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక పర్యాటక స్పాట్ ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Sept 2025 4:00 AM ISTఏపీలో పర్యటకాభివృద్ధికి ప్రభుత్వం కొత్త ఫార్ములా ప్రతిపాదిస్తోంది. ప్రపంచ పర్యాటకులు ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేయడంతోపాటు పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున స్టార్ హోటళ్లు నిర్మించాలని భావిస్తుంది. అంతేకాకుండా పర్యాటకులకు మంచి అనుభూతి కలిగించేందుకు హోమ్ స్టే విధానాన్ని పరిచం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం భావిస్తున్నారు. దీనివల్ల పర్యాటకులకు మంచి వసతితోపాటు స్థానికులకు ఆదాయం వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం వంటి ఆలయాలు ఉన్న ప్రాంతాలతోపాటు కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి కోసం హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హోమ్ స్టేలు ఉండాలని చెప్పారు. అంతేకాకుండా విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం కర్నూలు వంటి ప్రాంతాల్లో ఏదో ఒక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నిర్దేశించిన గడువులోగా పర్యాటక ప్రాంతాల్లో బస కోసం హోటల్ గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 వేలు, 2029 నాటికి 50 వేలు గదులు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు.
అనంతపురంలో డిస్నీ వరల్డ్
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక పర్యాటక స్పాట్ ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా పర్యాటక రంగం ద్వారా మెరుగైన ఉపాధి కల్పించడంతోపాటు సంపద పెంచాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్న సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మరో పది పర్యాటక కేంద్రాలకు సీప్లేన్ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక రాయలసీమలోని కీలకమైన అనంతపురంలో డిస్నీ వరల్డ్ స్థాపించేలా ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించాలని ఆదేశించారు. మెట్రో నగరాలకే పరిమితమైన డిస్నీ వరల్డ్ వినోద పరిశ్రమలో అగ్రగామిగా విరాజిల్లుతోంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ లో ఉన్న అనంతపురంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటు చేస్తే మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
కుప్పంలో ఏనుగుల సఫారీ
రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం అనేక కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఉన్న ఉండవల్లి గుహలు, అమరావతికి సమీపంలో ఉన్న కొండపల్లి ఖిలా వంటి పర్యాటక ప్రదేశాలను ప్రైవేటు సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అదేవిధంగా చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో, తైడ, అరకు, లంబసింగి, సూర్యలంక, గండికోట వద్ద టెంట్ సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం సూచిస్తున్నారు. ఇక రాజమండ్రిని సెంట్రల్ టూరిజం హబ్ చేయాలని ప్రతిపాదిస్తున్నారు.
