Begin typing your search above and press return to search.

ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్.. ప్రధాని మోదీకి లోకేశ్ థ్యాంక్స్

దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఆ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2025 7:56 PM IST
ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్.. ప్రధాని మోదీకి లోకేశ్ థ్యాంక్స్
X

కేంద్ర ప్రభుత్వం ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తోందని మరోసారి రుజువైంది. దేశంలో ఏర్పాటు చేయనున్న 4 సెమీకండక్టర్ల పరిశ్రమల్లో ఒకదాన్ని ఏపీకి కేటాయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. దేశంలో మొత్తం నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఏపీతోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. మొత్తంగా రూ.4,594 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమలను నిర్మిస్తారు.

దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఆ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం కొత్తగా నాలుగు పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దేశంలో మొత్తం 10 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. 2034 కల్లా నైపుణ్యం ఉన్న వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్ కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగానూ అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడనున్నాయని చెబుతున్నారు.

లోకేశ్ స్పందన

కాగా, ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టును కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హర్షం ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏపీకి వస్తోందన్నారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో లోకేశ్ పోస్టు చేశారు. అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్, దక్షిణ కొరియాకు చెందిన APACT కో.లిమిటెడ్ 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. సెమీ కండక్టర్లను మొబైల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు, ఆటో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తారని దత్వారా ఆత్మ నిర్భర భారత్ కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని లోకేశ్ పేర్కొన్నారు.