Begin typing your search above and press return to search.

సెల్ఫ్ ఎన్యుమరేషన్ : ప్రశ్నలన్నిటికీ బాబు జవాబు

ఏపీలో స్వీయ జనగణన కార్యక్రమం ప్రారంభం అయింది పదిహేను రోజుల పాటు ఇది ఏపీలో ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది.

By:  Satya P   |   16 April 2026 11:00 PM IST
సెల్ఫ్ ఎన్యుమరేషన్ : ప్రశ్నలన్నిటికీ  బాబు జవాబు
X

ఏపీలో స్వీయ జనగణన కార్యక్రమం ప్రారంభం అయింది పదిహేను రోజుల పాటు ఇది ఏపీలో ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ప్రతీ ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 దాకా సెల్ఫ్ ఎన్యుమరేషన్ కి సమయం ఉంది. ఆ తరువాత మే 1 నుంచి ఇంటింటికీ ఎన్యుమరేటర్లు వచ్చి నమోదు చేసుకోని వారి వివరాలని సేకరిస్తారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆయన స్వయంగా తన వివరాలు అన్నీ ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేశారు.

ప్రజల భాగస్వామ్యం :

ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ప్రజలు అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. ప్రజలు సమానంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన గుర్తు చేశారు. దాని కోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపోందించటం అవసరమని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని బాబు అన్నారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఈ నెల 16 నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందని ఆయన చెప్పారు.

జనాభా గణన :

ఇక వచ్చే ఏడాది నుంచి రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందని బాబు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల గణన కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరైన వివరాలను నమోదు చేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రజలను కోరారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్వయంగా బాబు నమోదు :

ఇదిలా ఉంటే స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాలని ఆయన నమోదు చేశారు. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆ మీదట బాబు అన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఆన్ లైన్ లో అంతా పూర్తి చేశారు.