Begin typing your search above and press return to search.

దేశంలోనే అతిపెద్ద రెన్యూ ఎనర్జీ ప్లాంట్.. రూ.22 వేల కోట్లతో ఏర్పాటు!

ఈ ప్లాంట్ తొలి దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరీజీ యూనిట్ ఏర్పాటు చేయనుంది.

By:  Tupaki Desk   |   14 May 2025 6:33 PM IST
దేశంలోనే అతిపెద్ద రెన్యూ ఎనర్జీ ప్లాంట్.. రూ.22 వేల కోట్లతో ఏర్పాటు!
X

కరువు సీమ అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. గతంలో కియా కార్ల పరిశ్రమతో అనంతపురం ప్రాంతంలో పారిశ్రామిక పురోగతికి ముందడుగు వేసిన ప్రభుత్వం.. తాజాగా దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను అదే ప్రాంతంలో నెలకొల్పాలని నిర్ణయించింది. దాదాపు రూ.22 వేల కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఈ నెల 16న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. దావోస్ లో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హాతో ఏపీ ప్రతినిధి బృందం చర్చించి రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకువచ్చిందని చెబుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా చెబుతున్న ఈ ప్లాంట్ తొలి దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరీజీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.7వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు రూ.22 వేల కోట్లుగా చెబుతున్నారు.

2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న రెన్యూ ఆ తర్వాత జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాకతో తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. దీనికి కారణం 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని పీపీఏలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడమే అంటున్నారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయంతో ఐదేళ్లపాటు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు కాలేదని టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాకతో భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.