తెలుగు నాడు...టీడీపీ కూటమికి ఓకేనా ?
ప్రతీ పధకానికి తెలుగు పేరు పెట్టారు, తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పాలనలో తెలుగుకు పెద్ద పీట వేశారు.
By: Satya P | 1 March 2026 12:41 PM ISTఆంధ్ర ప్రదేశ్ పేరు మార్పు అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ముందుకు వస్తోంది. దీనికి కారణం పక్కన ఉన్న కేరళ పేరు కాస్తా కేరళంగా మార్పు జరగడం. కేరళం అన్నది మళయాళ భాషలో ఉన్న పేరు. అది భాషకు ఇచ్చిన గౌరవం. లెఫ్ట్ కూటమి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తమ ప్రాంతీయతను భాషను గౌరవించుకుంటూ పేరు మార్చుకుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సైతం కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఇక దక్షిణాదిన చూస్తే కర్ణాటక రాష్ట్రం పేరు కూడా ప్రాంతాన్ని భాషను తెలియచేస్తోంది. అలాగే తమిళనాడు తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ ఏనాడో పేరు మార్చుకుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణా కూడా తమ భాష నుడికారానికి ప్రాంతీయ మమకారానికి చిహ్నంగా నిలిచింది. మరి ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఉత్తరాది వాసనతో హిందీ పేరు మిశ్రమంతో ఉంది. దాని మీదనే అంతా చర్చిస్తున్నారు. భాషాభిమానుల నుంచి అంతా కూడా ఏపీ పేరు మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచ తెలుగు సభల్లో :
ఇదిలా ఉంటే అమలాపురం కోనసీమ జిల్లాలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభలలో అనేక మంది వక్తలు అయితే తెలుగు తనం మనకు ధనం అంటూ చెప్పుకొచ్చారు. మహా సహస్రావధాని గరికపాటి నరసిం హారావు అయితే ఈ సభలలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లా ఆంధ్ర ప్రదేశ్ ఏమిటి అని ఆయన అన్నారు. ఈ పేరులో తెలుగు లేదని ఆయన అంటూ పేరు మార్చాలని కోరారు అంతే కాదు తెలుగు నాడు అన్న పేరుని సూచించారు. పైగా దాని వెనక ఉన్న చరిత్రను కూడా చెప్పారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు ఈ ప్రతిపాదన చేశారు అన్నారు. ఆ విధంగా తెలుగు నాడు పేరుని మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్ టీఅర్ ప్రతిపాదన ఏమిటి :
ఇదిలా ఉంటే 1983 నుంచి 1989 దాకా ఏడేళ్ళ పాటు తొలి దఫాలో పాలించిన ఎన్టీఅర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతీ పధకానికి తెలుగు పేరు పెట్టారు, తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పాలనలో తెలుగుకు పెద్ద పీట వేశారు. అదే క్రమంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ పేరుని కూడా తెలుగునాడుగా మార్చాలని చూశారని చెబుతారు. ఆలోచనలు చేశారు అని చెబుతారు. ఆ విధంగా అయితే అప్పట్లో చర్చ జరిగింది అని అంటారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో అది ప్రతిపాదన దశలో మరీ ముఖ్యంగా ఆలోచన దశలోనే ఉండిపోయింది అని అంటారు. అ. పైగా ఎన్ టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక శిబిరంలో ప్రముఖ నాయకుడు. దాంతో ఆయన ప్రతిపాదన అలా ఆగిపోయింది అని గుర్తు చేసుకుంటున్నారు.
కూటమికి ఆమోదమేనా :
ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం పార్టీ కనుక తలచుకుంటే ఆంధ్ర ప్రదేశ్ పేరు తెలుగు నాడుగా చాలా సులువుగా మారిపోతుంది. పైగా తెలుగు అస్థిత్వానికి ఎంతో విలువ గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా ఇది రాజకీయంగా మేలు చేసేదిగా ఉంటుంది అని అంటున్నారు. తెలుగు నాడు అంటే అందులో తెలుగుదేశం పార్టీ సౌండ్ కూడా ఎంతో బిగ్గరగా వినిపిస్తుంది. అలా బహుళ ప్రయోజనం కూడా సమకూరుతుంది అని అంటున్నారు. తెలుగు నాడు అని పేరు మార్చాలని కూటమి నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే వారు కానీ అభ్యంతరం చెప్పే వారు కానీ ఎవరూ ఉండరని అంటున్నారు పైగా కేంద్రంలో ఎన్ డీయే ప్రభుత్వం ఉంది. వెంటనే ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేస్తుంది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
