ఎర్ర పుస్తకం ఊసు లేకుండా లోకేశ్..! లిస్టు మొత్తం సెటిల్ అయ్యిందా?
తమకు ప్రధాన టార్గెట్ అయిన వైసీపీ నేతలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురిపై కేసులు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 15 Sept 2025 4:00 AM ISTఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించిన ఎర్ర పుస్తకం ఏమైంది? కొన్నాళ్లుగా రెడ్ బుక్ ప్రస్తావన ఎక్కడా వినిపించకపోవడంతో ఆ పుస్తకంలోని చాప్టర్లు అన్నీ క్లోజ్ అయ్యాయా? అన్న చర్చ జరుగుతోంది. లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విపక్షం చేసిన విమర్శలతో ప్రభుత్వమే వెనక్కి తగ్గిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో తమ పార్టీ వారిని వేధించిన వారి లెక్కలు తేల్చుతామంటూ యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ను ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం వారిని ఇబ్బందులకు గురిచేసిన అప్పటి అధికార పార్టీ నేతలు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తానని చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక చెప్పినట్లే రెడ్ బుక్ లో పేరు రాసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో కానీ, కొన్నాళ్లుగా ఎర్రబుక్ ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియాలో కూడా రెడ్ బుక్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో రెడ్ బుక్ అంటూ మంత్రి లోకేశ్ తోపాటు ఆయన అనుచరులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద హడావుడే చేశారని చెబుతారు. తన పాదయాత్రలో రెడ్ బుక్ చూపుతూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపి ఒక ఊపు తెచ్చిన లోకేశ్.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెడ్ బుక్ లో ఒక్కో చాప్టర్ లో ఒక్కొక్కరి పేరు ఉందని, వారందరి సంగతి తేల్చుతామని బహిరంగంగా హెచ్చరించేవారు. అంతేకాకుండా మంత్రి లోకేశ్ అధికార, అనధికార పర్యటన నిమిత్తం ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ పై కనీసం ఒక్కసారైనా మాట్లాడేవారు. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు.
తమకు ప్రధాన టార్గెట్ అయిన వైసీపీ నేతలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురిపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ మోహన్, పోసాని క్రిష్ణమురళి, తురకా కిషోర్, బోరుగడ్డ అనిల్ ఇలా చాలా మందిని అరెస్టు చేయించి జైలుకు పంపారు. ఈ అరెస్టులను నిరసించిన వైసీపీ నేతలు మంత్రి లోకేశ్ చట్టాన్ని అతిక్రమిస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. అంతేకాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు.
వైసీపీ అధికారంలో ఉండగా, రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకోవాలని విమర్శలు చేసిన నేతలు సైతం.. తాము ప్రతిపక్షంలోకి వెళ్లే సరికి రెడ్ బుక్ లో తమ పేరుందా? ఏ పేజీలో ఉంది? ఏ చర్యలు ఉంటాయని వాకబు చేసినట్లు ప్రచారం జరిగింది. రెడ్ బుక్ లో తమ పేరు తీసివేయాలని పలువురు తమకు తెలిసిన వారి ద్వారా మంత్రి నారా లోకేశ్ ను సంప్రదించినట్లు రాజధానిలో చర్చ జరిగింది. ఇదే సమయంలో రెడ్ బుక్ ఎక్కిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎక్కువగా నష్టపోయారు. పలువురు అధికారులు ఇప్పటికి పోస్టింగుకు నోచుకోక ఖాళీగా కాలం గడుపుతున్నారు.
అయితే ఇంతలా అందరినీ బెదరగొట్టిన రెడ్ బుక్ పై ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. అటు విపక్షం కూడా ఈ అంశంపై విమర్శలు చేయడం లేదు. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుందన్నట్లు.. రెడ్ బుక్ చర్యలు అమలు అయితే కదా, తాము ప్రతిస్పందించడానికి అంటున్నారు వైసీపీ నేతలు. అంటే మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ఇప్పుడు అమలు అవడం లేదన్నట్లు పరిస్థితి ఉందని పరోక్షంగా చెబుతున్నారు. ఇది ఒక విధంగా వైసీపీ విజయంగా చెబుతున్నారు. లోకేశ్ రెడ్ బుక్ అంటూ ఎన్ని హెచ్చరికలు చేసినా, రెడ్ బుక్ ఉత్తుత్తి బెదిరింపులు అంటూ టీడీపీ సోషల్ మీడియా ఒత్తిడి తెచ్చినా వైసీపీ చేసిన విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని అంటున్నారు.
పరిపాలించమని అధికారమిస్తే కక్ష సాధించుకుంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా? అంటూ వైసీపీ చేసిన విమర్శలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించేవిగా ఉండటం చేత ప్రభుత్వం రెడ్ బుక్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు. అందుకే రెండు మూడు నెలలుగా టీడీపీలో ఏ ఒక్కరూ రెడ్ బుక్ ప్రస్తావన తేవడం లేదని అంటున్నారు. చేతిలో అధికారం ఉండగా, కను సైగలతో శాసించే పరిస్థితి ఉండగా, ఉరకే బెదిరించి ప్రజల్లో చెడు అభిప్రాయం మూట గట్టుకోవడం ఎందుకు? అన్న ఆలోచనతో ప్రభుత్వం రెడ్ బుక్ పై ఎవరూ మాట్లాడొద్దని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిందని అంటున్నారు.
