రేషన్ విషయంలో జనాలేమనుకుంటున్నారు ?
ఏపీలో రేషన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం మార్చింది ఇంటింటికీ వాహనాల ద్వారా వచ్చి సరుకుని సరఫరా చేసే దానిని మార్చి ఇక మీదట చౌక దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పింది.
By: Tupaki Desk | 1 Jun 2025 5:49 PM ISTఏపీలో రేషన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం మార్చింది ఇంటింటికీ వాహనాల ద్వారా వచ్చి సరుకుని సరఫరా చేసే దానిని మార్చి ఇక మీదట చౌక దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పింది. ఆ మేరకే కీలక నిర్ణయం తీసుకుంది. దానినే అమలు చేస్తోంది.
జూన్ 1 నుంచి రేషన్ సరకులను చౌక దుకాణాల వద్దనే పంపిణీ చేయడమే కాదు దానిని ఆర్భాటంగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ప్రారంభించారు. ఇక చౌక దుకాణాల వద్దనే తిరిగి రేషన్ సరకులు పంపిణీ ఎందుకు అన్న దానికి కూటమి చెప్పే కారణాలు వారికి ఉన్నాయి.
ఇంటింటికీ వాహనాల ద్వారా రేషన్ సరకు సరిగ్గా అందడం లేదని కేవలం తూతూ మంత్రంగా ముప్పయి శాతం మాత్రమే అందిస్తూ మిగిలిన దానిని పక్క దాని పట్టిస్తున్నారు అని విమర్శిస్తున్నారు. బియ్యం అక్రమంగా తరలిపోతోందని దాని వల్ల చాలా మంది రేషన్ తీసుకునే లబ్దిదారులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు.
అంతే కాదు ఎపుడు వస్తారో ఎపుడు ఎక్కడ వాహనాలు నిలుపుతారో తెలియదని కచ్చితమైన సమయాలు ఉండవని, అలాగే ప్రతీ నెలలో కూడా ఈ విధంగానే చేస్తూ అక్రమాలకు తెర తీసే విధంగా ఈ విధానం ఉందని అంటున్నారు. రేషన్ బియ్యం పెద్ద ఎత్తున ఏపీ నుంచి అక్రమ తరలింపు వెనక ఈ లోపభూయిష్ట విధానం ఒక ప్రధాన కారణం అని అంటున్నారు.
ఈ కారణాలతోనే తిరిగి పాత విధానాలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఇంటింటికీ రేషన్ సరకులు ఇచ్చే దానిని రద్దు చేసి ఒక మంచి సేవను జనాలకు దూరంగా చేశారు అని వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద వైసీపీ అధినేత జగన్ అయితే చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.
ఇదే నా మీ విజన్ ప్రశ్నిస్తున్నారు. తాను పాదయాత్ర సమయంలో జనాల కష్టాలను కళ్ళారా చూసి వారి కోసం ఈ విధానం అమలు చేశామని ఆయన చెప్పారు. దీని వల్ల వృద్ధులు మహిళలు వికలాంగులు అంతా ఎంతో ఉపశమనం పొందుతూ వచ్చారని ఆయన అంటున్నారు. రేషన్ వాహనాల తొలగింపుతో ఏకంగా 20 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. వారంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఇతర బలహీన వర్గాలు అని ఆయన అంటున్నారు.
మొత్తం మీద చూస్తే రేషన్ సరుకు ఇంటింటికీ సరఫరా చేసే తమ విధానం బాగుందని వైసీపీ అంటూంటే ఆ విధానం తప్పుల తడక కాబట్టే తాము పాత విధానం పునరుద్ధరించామని టీడీపీ కూటమి అంటోంది. సరే ఈ రెండు వాదనలు పక్కన పెడితే జనాలు ఏమి అనుకుంటున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం. జనాలు అయితే భిన్నంగా స్పందిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మైదాన ప్రాంతాలలో ఉన్న లబ్దిదారులు అయితే తమకు సమీపంలో రేషన్ దుకాణం ఉండడంతో తమ పనులు చూసుకుని రోజులో ఎపుడో ఒకపుడు రేషన్ సరకులు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన విధానమే బాగుంటుంది అని అంటున్నారు.
వాహనాలలో డోర్ డెలివరీ అంటున్నా అవి వీధి చివరలోనే నిలిపి ఉంచేవారు కాబట్టి దాని వల్ల పెద్దగా లాభం లేదని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఒక వేళ ఆ సమయానికి కనుక తాము వెళ్ళకపోతే మాత్రం రేషన్ సరుకు కోసం ఇబ్బంది పడేవారమని కూడా చెబుతున్నారు.
అందువల్ల వారంతా కూటమి తెచ్చిన ఈ విధానానికే మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల వారు, అలాగే సదూరమైన గ్రామాలలో ఉండేవారు మాత్రం రేషన్ వాహనాల ద్వారా సరుకులు తమ సమీపంలోకి తెచ్చి పంపిణీ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. రేషన్ దుకాణాలకు తాము రావాలంటే దూరాభారాలు అని అంటున్నారు.
అలా జనంలో దీని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఎక్కడ రేషన్ దుకాణాలు దగ్గరగా లేవో చూసి వాటిని ఏర్పాటు చేస్తే మేలుగా ఉంటుంది. అలా కాకపోతే వాహనాలను ఆ ప్రాంతాలకు పంపిస్తే కూడా బాగుంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా రేషన్ దుకాణం అన్నది ఒక చిరునామాగా ఉండాల్సిందే అని అంటున్నారు. అదే సమయంలో రేషన్ డీలర్ల మీద పర్యవేక్షణ లేకపోతే మళ్ళీ జనాల ముంచి ఇబ్బందులు విమర్శలు వస్తాయని కూడా అంటున్నారు.
