టార్గెట్ అసెంబ్లీ: రెండు నియోజకవర్గాలపై.. షర్మిల కన్ను.. !
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికీ తన వ్యూహాన్ని మార్చుకునే అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా.. `అధ్యక్ష` అనాలి అనే వ్యూహంతో షర్మిల వ్యవహరిస్తున్నారు.
By: Garuda Media | 16 May 2026 8:30 AM ISTకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత 2024 ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేశారు. ఇది ఆమెకు ఒక రకంగా మైనస్ అయింది అన్నది పార్టీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. గతంలోనే ఈ విషయంపై అంతర్గతంగా కూడా ఆరా తీశారు.
పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేసి ఉంటే కచ్చితంగా షర్మిల విజయం సాధించి ఉండేది అన్న వాదన అప్పట్లో వినిపించింది. కానీ, అనూహ్య కారణాలతో ఆమె అవినాష్ రెడ్డి పై పోటీ చేసి గెలవాలన్న పంతం పెట్టుకుని కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. నిజానికి అప్పటివరకు వైయస్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధించేలా ఓటు వేసిన కడప ప్రజలు ఆ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను ఓడించే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అసెంబ్లీకి కనక ఆమె పోటీ చేసి ఉంటే విజయం సాధించి ఉండేవారన్న చర్చ కూడా వచ్చింది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికీ తన వ్యూహాన్ని మార్చుకునే అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా.. `అధ్యక్ష` అనాలి అనే వ్యూహంతో షర్మిల వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలక నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమకు కలిసి వచ్చిన కడప జిల్లాలోనే ఆమె వచ్చే ఎన్నికల్లోను పోటీ చేయనున్నారు. అయితే ఆ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. స్థానికంగా ఈ విషయంపై షర్మిల పార్టీ నాయకుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు,
తాను వ్యక్తిగతంగా పోటీ చేస్తే ఏ మేరకు విజయం సాధించగలుగుతారు,, అనే విషయాన్ని ఆమె తెలుసుకుంటున్నారు. వీటిలో ఒకటి కడప అసెంబ్లీ నియోజకవర్గం. రెండవది తన సొంత మేనమామ ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గం కావడం విశేషం. కమలాపురం నియోజకవర్గం షర్మిల మాతృమూర్తి విజయలక్ష్మి పుట్టినిల్లు కూడా కావడం గమనార్హం. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తనకు ప్రజలు పట్టం కడతారని షర్మిల భావించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంతర్గతంగా సర్వేలు కూడా చేయిస్తున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోట గెలిచిన తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టేది ఖాయమని ఆమె చెప్పుకొస్తున్నారు. కడప నియోజకవర్గంలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే వాస్తవానికి ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంకు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం పార్టీ పెట్టిన జగన్కు ఈ ఓటు బ్యాంకు అనుకూలంగా మారింది. ఇప్పుడు దీనిని తన వైపు తిప్పుకునే దిశగా షర్మిల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మాధవి రెడ్డి టిడిపి తరఫున విజయం సాధించారు.
అదేవిధంగా కమలాపురం నియోజకవర్గం ఏకంగా తన మాతృమూర్తికి పుట్టినఇల్లు కావడంతో అక్కడి ప్రజలు తన వైపే ఉంటారని షర్మిల అంచనా వేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల నుంచి షర్మిల పోటీ చేయడం.. ఏదో ఒకచోట గెలిచినా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. `టార్గెట్` అసెంబ్లీ లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు.
