Begin typing your search above and press return to search.

రాష్ట్రం అధికారాలకు కత్తెర, కేంద్రానికి పెత్తనం.. విజయసాయి మాస్టర్ ప్లాన్

ఏపీ రాజకీయాల్లో ఏదో విధంగా తన ఉనికి చాటుకోవాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   24 Jun 2026 6:00 PM IST
రాష్ట్రం అధికారాలకు కత్తెర, కేంద్రానికి పెత్తనం.. విజయసాయి మాస్టర్ ప్లాన్
X

ఏపీ రాజకీయాల్లో ఏదో విధంగా తన ఉనికి చాటుకోవాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరం అంటూ ఆయన చేతులు దులుపుకున్నా.. తరచూ సోషల్ మీడియా ద్వారా ప్రజలు, ప్రభుత్వపరమైన అంశాలపై ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే, మాజీ ఎంపీ విజయసాయికి ఇంకా ప్రజా జీవితంపై వ్యామోహం తగ్గలేదోమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విధమైన ఉచిత సూచనలు, సలహాలతో విజయసాయిరెడ్డి వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ ను ఉదహరిస్తున్నారు.

ఎన్నారై నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళిన ఎన్నారైలు తమ స్వగ్రామాలను అభివృద్ధి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని, అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, ప్రభుత్వాల జోక్యం ఎక్కువగా ఉండటంతో వారు వెనకాడుతున్నారని సాయిరెడ్డి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నారైలు నేరుగా తమ గ్రామాల్లో రోడ్లు, గ్రంథాలయాలు, తాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. ఇది సినిమా 'శ్రీమంతుడు' తరహాలో అభివృద్ధికి బాటలు వేసే మంచి ఆలోచనలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలు ఆసక్తిని కలిగిస్తున్నాయని అంటున్నారు.

ఉనికి చాటుకునే ప్రయత్నమా?

గత ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, అడపాదడపా చేసే ఈ ట్వీట్లు చూస్తుంటే ఆయనకు ఇంకా రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వ విధానాలతోపాటు కీలకమైన సమస్యలపై తన గొంతు వినిపించడం ద్వారా ‘‘నేను ఇంకా ఉన్నాను’’ అని ఆయన సంకేతాలు ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి, కేవలం ట్వీట్ల ద్వారా అయినా ప్రజల్లో చర్చను లేవనెత్తడం ఆయన వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంపై వ్యూహాత్మక ఒత్తిడి

ఈ ప్రతిపాదనలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పరోక్షంగా తగ్గించి, కేంద్రం ద్వారా పనులు చేయించాలని కోరడం విజయసాయిరెడ్డి వ్యూహాత్మక ఆలోచనగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉంటే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆరోపించడంతోపాటు నేరుగా కేంద్రమే ఈ నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని కోరడం ద్వారా, ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత పాలన పట్ల పరోక్ష అసహనాన్ని వ్యక్తపరుస్తున్నట్లు ఉందని అంటున్నారు. కేంద్రం ద్వారా ఇలాంటి పథకాలను అమలు చేయిస్తే, అది రాష్ట్రంలో కేంద్రం పెత్తనం, ప్రభావం పెరిగేలా చేస్తుందని విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు ఉందని అంటున్నారు. అంటే, తన సలహాల ద్వారా ఒకవైపు కేంద్రంతో సాన్నిహిత్యాన్ని చాటుకుంటూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని పరిమితం చేసేలా సాయిరెడ్డి పావులు కదుపుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.