కాంగ్రెస్ కూడా టీడీపీ కూటమిలోనేనా ?
ఏపీలో రాజకీయం బహు చిత్రంగా ఉంటుంది. ఎవరేమిటి అన్నది ఒక పట్టాన తెలియదు. ఏపీలో చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
By: Tupaki Desk | 5 April 2025 8:52 AM ISTఏపీలో రాజకీయం బహు చిత్రంగా ఉంటుంది. ఎవరేమిటి అన్నది ఒక పట్టాన తెలియదు. ఏపీలో చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మామూలుగా అయితే టీడీపీ ప్రభుత్వం అని పిలిచేవారు. ఇపుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. ఇదొక వింత అనుభవం గానే ఉంది.
దీనిని ముందు 2014లో కూడా బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా దానిని అచ్చమైన చంద్రబాబు ప్రభుత్వంగానే అంతా చూశారు, అలాగే మీడియా రాసింది. కానీ ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడంతో పాటు ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉండడం, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. ఈ రెండు పార్టీలకు కలిపి ఏకంగా నలుగురు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు.
అంటే మొత్తం మంత్రివర్గంలో ఆరవ వంతు అన్న మాట. అలాగే 16 శాతం అన్న మాట. మరి ఈ విధంగా ఒక గుర్తించతగిన నంబర్ తో కూటమిలో మిత్ర పక్షాలు ఉన్నాయి. ఒక విధంగా సగం పార్టీలు అధికారంలోనే ఉన్నట్లుగా లెక్క. మరి బయట మిగిలినవి ఏమిటి అంటే వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర చిన్న పార్టీలు.
ఇవన్నీ కలిపి విపక్షం అని అనాలి. అలాగే చెప్పాలి కూడా కానీ విపక్షం ఏకైకమైనది వైసీపీయే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ పార్టీ ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉంటూ కేంద్రంలోని ఎన్డీయే కూటమిని ఎదిరించి నిలబడిన కాంగ్రెస్ ని ఏపీలో కూటమిలోకి చేర్చేస్తున్నారు. ఎన్డీయే కూటమిలో కాంగ్రెస్ కూడా భాగమే అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
ఆయన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా కాకుండా బాబు తరఫున ఆమె మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిల ఒక భాగంగా మారారు అని అంటున్నారు. వక్ఫ్ బిల్లు మీద టీడీపీ బీజేపీకి అనుకూలంగా ఓటు చేస్తే దాని మీద బాబుని ప్రశ్నించకుండా జగన్ మీద విమర్శలు చేయడమేంటి అని ఆయన నిలదీశారు.
బాబుకు ఏ ఇబ్బంది వచ్చినా షర్మిల మీడియా ముందుకు వస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కేవలం అన్న మీద కక్ష సాధించడానికే షర్మిల తెలంగాణాలో తన పార్టీని మూసేసి మరీ కాంగ్రెస్ లో చేరారు అని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ ని ప్రతిపక్ష పార్టీగా తాము భావించడం లేదని జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు కూటమికి సహకరిస్తున్న పార్టీగానే చూస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కూడా ఆ తానులో ముక్కే అని అంబటి తేల్చేశారు.
ఇక చంద్రబాబుకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని వారికి హెరిటేజ్ కంపెనీలో బాబు వాటాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెల్లెలుకు ఆస్తి ఇవ్వాలీ అంటే ఆయన ఇష్టమని అన్నారు. ఒకవేళ న్యాయ ప్రకారం హక్కులు ఉన్నాయని భావిస్తే కోర్టులో షర్మిల తేల్చుకోవాలని అంతే తప్ప ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఈ వ్యక్తిగత విమర్శలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మొత్తం మీద జగన్ ని పదహారు నెలల పాటు జైలులో పెట్టిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను మరింతగా సాధించేందుకే చెల్లెలుని తెచ్చి పార్టీ ప్రెసిడెంట్ గా చేసింది అని అంబటి లాంటి వారు భావిస్తున్నారు. అంతే కాదు ఏపీలో వైసీపీని టార్గెట్ చేయడమే షర్మిల పని అన్నారు. సో అందుకే కూటమిలో ఆ పార్టీని కలిపేశారు అన్న మాట.
