వైసీపీని ఫాలో అయితే చాలు.. బాబు గెలిచిపోతారు.. !
అదేంటి ? అనుకుంటున్నారా ? ఎస్..!. రాజకీయాల్లో ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం తప్పుకాదు.
By: Garuda Media | 5 Jun 2026 7:00 PM ISTఅదేంటి ? అనుకుంటున్నారా ? ఎస్..!. రాజకీయాల్లో ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం తప్పుకాదు. ఏ మంచి చేస్తే.. ప్రజలకు చేరువగా ఉంటామో.. తమిళనాడు రాజకీయాలు నేర్పుతాయి. ఒక ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను మరో ప్రభుత్వం కొనసాగిస్తుంది. పైగా వాటి పనితీరును కూడా పెంచి .. లబ్ధిదారులకు మేలు చేస్తుంది. తద్వారా.. ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత లేకుండా చేసుకుంటుంది. ఇటీ వల తమిళనాడులో విజయ్ హవా లేకపోయి ఉంటే.. డీఎంకే మరోసారి విజయం దక్కించుకు నేదన్నది వాస్తవం.
ఇక, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు నడుపుతున్న తీరును చూస్తే.. ప్రజలతో ఎలా వ్యవహరించాలో.. సమయానికి ఎలా స్పందించాలో కూడా తెలుస్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా.. ఎంత మౌనంగా ఉండాలో.. పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. కరతలా మలకం అన్నట్టు మోడీ నేర్పుతారు. అయితే.. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. వైసీపీని ఫాలో అయితే చాలు.. మరోసారి చంద్రబాబు తన కూటమి ప్రభుత్వాన్ని సునాయాసంగా అధికారంలోకి తీసుకురావొచ్చని అంటున్నారు పరిశీలకులు.
ఒకింత చిత్రంగా ఉన్నా.. వాస్తవమే. వైసీపీ హయాంలో జరిగిన కొన్నిపనులు.. ప్రజల్లో వైసీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. అలాంటివాటికి దూరంగా ఉంటే చాలని.. తద్వారా ప్రజల అభిమానం సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చెత్తపై పన్ను, విచ్చలవిడిగా కరెంటు చార్జీల పెంపు.. ప్రతి పనికీ.. చేతులు తడపాల్సిన పరిస్థితి.. ఇలా క్షేత్రస్థాయిలో పెద్ద ప్రభావం చూపించిన ఈ విషయాలను లేకుండా చేస్తే టీడీపీ కూటమి సునాయాసంగా విజయం దక్కించుకుంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం చెత్తపై పన్నును మరోసారి పెంచారన్నది వాస్తవం. అయతే.. వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా.. ప్రస్తుతం చెత్తపై పన్నును ఇంటి పన్నులో కలిపి విధిస్తున్నారని తెలుస్తోంది. ఇది ప్రజలపై ఇంపాక్ట్ చూపిందని అనుకుంటే పొరపాటే. ఇక, ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం.. ఇది ఎలానూ చేస్తున్నారు. కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడుతున్నారన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో తేడా కొడుతుంది. గతంలో వైసీపీ ఇలానే చేసి.. చేతులు కాల్చుకుంది. ఈ నేపథ్యంలో గత వైసీపీ పాలనను నిశితంగా గమనించి.. అప్పటి పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు పునరావృతం కాకుండా చూసుకుంటే చంద్రబాబుకు గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు పరిశీలకులు.
