సైబర్ కమాండోస్ గా కొత్త కానిస్టేబుల్స్.. సైబర్ మోసాలపై ఏపీ ప్రభుత్వం సర్కారు యాక్షన్
లాఠీ పట్టుకో.. దొంగను కనిపెట్టు అనే ధోరణిని కాస్త పక్కన పెట్టి.. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లను పట్టుకునేలా కానిస్టేబుళ్ నుంచి ఉన్నతాధికారి వరకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం.
By: Tupaki Desk | 3 Sept 2025 3:00 AM ISTఏపీలో ఆధునిక పోలిసింగ్ పై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. లాఠీ పట్టుకో.. దొంగను కనిపెట్టు అనే ధోరణిని కాస్త పక్కన పెట్టి.. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లను పట్టుకునేలా కానిస్టేబుళ్ నుంచి ఉన్నతాధికారి వరకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం. లాఠీలతో తిరిగే కానిస్టేబుళ్లను కంప్యూటర్ల ముందు కూర్చొబెట్టి డేటా అనలిస్టులుగా మార్చేస్తోంది. డేటా సేకరించి నేరస్తుల ఆటకట్టించేలా సైబర్ కమాండో వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
రాష్ర్టంలోఫ్యూడల్ పోలీసింగుకు టాటా చెప్పి.. హ్యూమన్ టచ్ తో కూడిన ఆధునిక పోలీసింగ్ కు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నియమించిన 6024 కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా వాడుకునేలా పోలీసుశాఖ చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన ఈ 6024 మంది కొత్త కానిస్టేబుళ్లకు సైబర్ కమాండోల్లా తయారు చేసేలా సైబర్ క్రైం కట్టడికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
ఈ సారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 6 వేల మందిలో సుమారు 4051 మంది డిగ్రీ పట్టభద్రులు కాగా, ఎంబీఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎల్ఎల్బీ, ఎంఏ వంటి కోర్సులు చదివిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా సాంకేతిక విద్య అభ్యసించిన వారు వందల మంది ఉన్నారని చెబుతున్నారు. దీంతో వీరికి సంప్రదాయ పోలీసు శిక్షణతోపాటు సైబర్ క్రైం నివారణపైనా ట్రైనింగ్ ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా భావిస్తున్నారని దీనిపై ఇటీవల కొందరు ఉన్నతాధికారులతో చర్చించారని అంటున్నారు.
మరోవైపు త్వరలో ప్రారంభమయ్యే శిక్షణ కార్యక్రమంలో సైబర్ టెక్నిక్స్ నేర్పించనున్నట్లు చెబుతున్నారు. దీనికోసం శిక్షణ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. మంగళగిరిలో ఉన్న పోలీసు హెడ్ క్వార్టర్సులో ప్రత్యేక స్టుడియో ఏర్పాటు చేసి అక్కడి నుంచి సైబర్ నిపుణులతోపాటు ఫోరెన్సిక్, ఇన్వెస్టిగేషన్, ఆర్థిక మోసాలు, మహిళలపై అఘాయిత్యాలు తదితర నేరాలపై అవగాహన ఉన్న నిపుణులతో క్లాసులు ఇప్పించనున్నారు.
