Begin typing your search above and press return to search.

ఏపీ అవతరణ దినోత్సవం...బాబు సంచలన వ్యాఖ్యలు

గడచిన 14 ఏళ్ళుగా ఏపీకి అవతరణ దినోత్సవం అన్నది లేని సంగతి తెలిసిందే. 2014 జూన్ 2న ఏపీ తెలంగాణలను అధికారికంగా విడదీస్తూ అపాయింట్మెంట్ డేని ప్రకటించింది.

By:  Satya P   |   28 March 2026 11:46 PM IST
ఏపీ అవతరణ దినోత్సవం...బాబు సంచలన వ్యాఖ్యలు
X

గడచిన 14 ఏళ్ళుగా ఏపీకి అవతరణ దినోత్సవం అన్నది లేని సంగతి తెలిసిందే. 2014 జూన్ 2న ఏపీ తెలంగాణలను అధికారికంగా విడదీస్తూ అపాయింట్మెంట్ డేని ప్రకటించింది. ఆ రోజు తెలంగాణా అవతరణ దినోత్సవం అయింది. ప్రతీ ఏటా ఆ రాష్ట్రం చేసుకుంటూ వస్తోంది. కానీ ఏపీ మాత్రం నాటి నుంచి అవతరణ దినోత్సవాన్ని మరచిపోయింది. దానికి కారణం ఏంటి అంటే ఏపీకి మూడు అవతరణ దినోత్సవాలు ఉన్నాయి. దేనిని ఖరారు చేసుకోవాలి అన్నదే గందరగోళం అంటున్నారు. ఏపీ 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. దాంతో మూడేళ్ళ పాటు దానిని అవతరణ దినోత్సవంగా చేసుకున్నారు. 1956లో ఉమ్మడి ఏపీకి నవంబర్ 1వ తేదీని అవతరణ దినోత్సవంగా నిర్ణయించారు. ఇక 2014తో ఆ ముచ్చట తీరిపోయింది.

ఏపీకి ఏ రోజుని ఫార్మేషన్ డే :

తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. మరి లాజిక్ గా ఆలోచిస్తే ఏపీకి ఆ రోజు ఫార్మేషన్ డేగా ఉండాలి. కానీ ఏపీ నుంచి తెలంగాణా విడిపోయింది కాబట్టి ఏపీకి కొత్తగా అవతరణ ఏముంటుంది అన్న వాదన ఉంది. అంతే కాదు ఏపీ కోరని విభజన ఇదని అందువల్ల జూన్ 2 ఏపీకి వర్తించదు సరికదా అది యాంటీ సెంటిమెంట్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దాంతో ఏపీకి ఏ రోజుని ఫార్మేషన్ డే చేయాలన్నది ఈ రోజుకీ తేలలేదు. దాని మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

గందరగోళంగానే అంటూ :

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించిందని బాబు గుర్తు చేశారు. అలా మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు రాజధాని మారిందని అన్నారు. ఇప్పుడు అమరావతికి రాజధానిని మార్చుకున్నామని అన్నారు. ఇలా రాజధానులు కోల్పోవటంతో పాటు విమర్శలు వివక్ష, అవమానాలు భరిస్తూనే వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు ఇలా ఏపీ రాష్ట్ర అవతరణ తేదీలు మారాయని సభకు బాబు చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఇక . పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును స్మతీ దినంగా జరుపుకుంటున్నామని బాబు వెల్లడించారు.

ఆనాటిది అమరావతి :

అమరావతి చరిత్ర ఈనాటిది కాదని వేల ఏళ్ళ నుంచి ఉందని చంద్రబాబు వివరించారు. కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహన రాజులు గతంలో పరిపాలించారని అన్నారు. అలాగే బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఆనాటి చరిత్రను స్పష్టంగా చెప్తోందని తెలిపారు. అంతటి ప్రాచీన, ఘన చరిత్ర మన తెలుగు జాతిదని ఆయన వివరించారు. ఇలా సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేలగా ఏపీ ఉందని బాబు చెప్పారు. ఇక బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయని, రెండు వందల ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి ఆత్మ :

ఇక ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులుగా గుర్తింపు వచ్చిందని బాబు చెప్పారు. ఇక చూస్తే అమరావతి అజేయమని, అజరామరం అని బాబు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఆత్మ అన్నారు. ఇక మీదట అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని, కనీసం ఇంచ్ కూడా కదల్చ లేరని ఆయన స్పష్టం చేశారు. దేశం గర్వించేలా భవిష్యత్‌ నగరంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు.

అందరూ జీవించేలా :

అమరావతి భవిష్యత్తులో మోస్ట్ లివబుల్ సిటీగా మారుతుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి సొంత రాజధాని నిర్మాణం చేయాలనే 2014లో అమరావతికి వచ్చామని బాబు చెప్పారు కేవలం తొమ్మిది నెలలలోనే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నామని అన్నరు. దేశం బాగుండాలి, ఆంధ్ర జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ నినాదం అన్నారు. అలాగే తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన సంకల్పమని బాబు స్పష్టం చేశారు.