పేదింటికి కొండంత భరోసా...కూటమి సంచలనం
పేదల పండుగ అంటూ ప్రతీ నెలా ఒకటవ తేదీన నిర్వహిస్తున్న సామాజిక పెన్షన్ల పర్వంలో కొత్త అధ్యాయానికి తెర లేచింది.
By: Satya P | 7 Sept 2026 9:26 AM ISTపేదల పండుగ అంటూ ప్రతీ నెలా ఒకటవ తేదీన నిర్వహిస్తున్న సామాజిక పెన్షన్ల పర్వంలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. ఇప్పటిదాకా ఇస్తున్న సామాజిక పెన్షన్లకు అదనంగా అర్హత కలిగిన మరింత మందికి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఎవరైతే అర్హత కలిగి కూడా పెన్షన్లకు దూరంగా ఉన్నారో వారికి ఇపుడు పెన్షన్లు దక్కనున్నాయి. అలా పేదింటికి కొండంత భరోసా దక్కనుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో ఏపీలో కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం అయింది.
62 లక్షలకు ప్లస్ గా :
ఇదిలా ఉంటే ఏపీలో ప్రతి నెలా జరిగే పేదల పండుగలో అందించే 62 లక్షల సామాజిక పెన్షన్లకు తోడు మరింతమందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. దీంతో అర్హత కలిగిన మరింత మంది పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు కొత్తగా అవకాశం కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద తాజా దరఖాస్తుల స్వీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హత నిర్ధారణ, ప్రభుత్వ ఆమోదం వరకు ప్రతి ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి అర్హులైన వారికి దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.
వారికి మరో అవకాశం :
దీంతో ఇప్పటిదాకా అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో సామాజిక పెన్షన్ పొందని వారికి మరో అవకాశం కల్పిస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారు తమకు సంబంధించిన స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తరువాత నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం అర్హతను పరిశీలిస్తారు. జాప్యానికి తావులేకుండా స్పష్టమైన కాలపట్టిక కూడా రూపొందించి మరీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దాంతో కొత్త పింఛన్ దరఖాస్తుల ప్రక్రియలో పారదర్శకతతో పాటు వేగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి దశకు స్పష్టమైన గడువు నిర్ణయించింది.
ఇదీ విధానంగా :
ఇక ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణకు సెప్టెంబర్ 7 నుంచి 16 వరకూ గడువుగా పెట్టారు. అలాగే సాధారణ అర్హత పరిశీలనకు సెప్టెంబర్ 17 నుంచి 21 దాకా సమయం ఇచ్చారు. భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసుకు సెప్టెంబర్ 22 నుంచి 24 దాకా గడువు ఉంటుంది. సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియకు సెప్టెంబర్ 25, 26 తేదీలు సమయంగా ఉంటుంది. ఇలా అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారు.
అందుబాటులోనే అంతా :
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ దరఖాస్తు సేవ అందుబాటులో ఉంటుంది. నిర్ణీత నమూనాలోని దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. అర్హులు దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అందజేస్తారు. ఇక అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక ధృవపత్రాలను సమర్పించాలి. వృద్ధాప్య పింఛన్ కోసం వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డు, వితంతు పింఛన్ కోసం భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబర్, ఒంటరి మహిళ వివాహిత అయితే కోర్టు, అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసే వివాహం కాని ధృవపత్రం ఉండాలి. దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే సదరన్ ధృవపత్రం ఉండాలి. చేనేత కార్మికులకు చేనేత మరియు జౌళి శాఖ ధృవపత్రం, మత్స్యకారులకు మత్స్య శాఖ ధృవపత్రం, డప్పు కళాకారులకు సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం, సంప్రదాయ చెప్పుల తయారీదారులకు సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం, కల్లుగీత కార్మికులకు నిషేధ ఎక్సైజ్ శాఖ ధృవపత్రం, ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులకు జిల్లా వైద్య మండలి ధృవపత్రం తప్పకుండా సమప్రించాల్సి ఉంటుంది.
పెన్షన్ ఒక్కో కేటగిరీకి :
ఇక చూస్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాల పెంపును అమలు చేసింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలు వర్గాలకు పది వేల రూపాయలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 వరకు పింఛన్లు అందుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు 73 వేల 508 కోట్ల రూపాయలను కేవలం పింఛన్ల కోసమే వ్యయం చేసినట్లుగా గణాంకాలు తెలియచేస్తున్నాయి.
