Begin typing your search above and press return to search.

గ‌డువుకు 24 గంట‌ల ముందు.. కొత్త జిల్లాలపై ఏపీ నోటిఫికేష‌న్‌!

ప‌లు మండ‌లాలు స‌హా..జిల్లా కేంద్రాల‌ను మార్పు చేశారు. ఇవ‌న్నీ కూడా డిసెంబ‌రు 31వ తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్రభుత్వం నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేసింది.

By:  Garuda Media   |   31 Dec 2025 9:48 AM IST
గ‌డువుకు 24 గంట‌ల ముందు.. కొత్త జిల్లాలపై ఏపీ నోటిఫికేష‌న్‌!
X

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను 28 జిల్లాలుగా మారుస్తూ.. ఏపీ మంత్రివ‌ర్గం సోమ‌వారం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు.. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా.. మంగ‌ళ‌వారం రాత్రి నోటిఫికేష‌న్ జారీ చేసింది. అయితే.. కేంద్ర గ‌ణాంక శాఖ డిసెంబ‌రు 31 వ‌ర‌కు మాత్ర‌మే జిల్లాలు, మండ‌లాల స‌రిహ‌ద్దులు మార్చేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు అవ‌కాశంఇచ్చింది. ఆ త‌ర్వాత‌.. జ‌న‌వ‌రిలో ఆయా మార్పుల‌కు సంబంధించి కేంద్రానికి రాష్ట్రాలు స‌మాచారం ఇవ్వాలి. అనంత‌రం .. ఆ మార్పులు చేర్పుల ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రి నుంచి దేశ‌వ్యాప్తంగా కేంద్ర గ‌ణాంక‌శాఖ‌.. కుల గ‌ణ‌న చేప‌ట్ట‌నుంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర గ‌ణాంక శాఖ పెట్టిన గ‌డువుకు 24 గంట‌ల ముందు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌పై నోటిఫికేష‌న్ జారీ చేయ డం విశేషం. అయితే.. దీనిని ప్ర‌జ‌లు ఏమేర‌కు స్వాగ‌తిస్తార‌న్న‌ది చూడాలి. ఇదిలావుంటే.. కొత్త‌గా ఏర్ప‌డిన మార్కాపురం జిల్లా కు మార్కాపురాన్నే జిల్లా కేంద్రంగా ఉంచారు. అయితే.. అతి చిన్న జిల్లాగా ఏర్పాటు చేస్తున్న పోల‌వ‌రం జిల్లాకు మాత్రం.. రంప చోడ‌వరం నియోజక‌వ‌ర్గాన్ని జిల్లా కేంద్రం చేశారు. ఇదేసమ‌యంలో శ్రీకాకుళం, తిరుప‌తి, చిత్తూరు, అన్న‌మ‌య్య జిల్లాల్లో భారీ మార్పులు చేశారు. ప‌లు మండ‌లాలు స‌హా..జిల్లా కేంద్రాల‌ను మార్పు చేశారు. ఇవ‌న్నీ కూడా డిసెంబ‌రు 31వ తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్రభుత్వం నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేసింది.

మార్పులు ఇవీ..

+ మొత్తం జిల్లాలు.. 26 నుంచి 28కి పెరుగుతాయి.

+ మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్త‌గా ఏర్పాటు చేశారు.

+ పోల‌వ‌రం జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని ఏర్పాటు చేశారు.

+ మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురాన్నే నిర్ణ‌యించారు.

+ మండలాల పరిధిలోనూ భారీ మార్పులు చేశారు.

+ శ్రీకాకుళం జిల్లాలోని నందిగామ మండలాన్ని టెక్క‌లిలో క‌లిపారు.

+ అదేవిధంగా ప‌లాస డివిజ‌న్‌ను కూడా టెక్క‌లికి బ‌దిలీ చేశారు.

+ సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌కు మార్చారు.

+ తూర్పుగోదావ‌రి జిల్లాలోని పెనుగొండ మండ‌లం పేరును ‘వాసవీ పెనుగొండ’గా మార్పు చేశారు.

+ ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని `అడ్డరోడ్డు జంక్షన్‌` ను రెవెన్యూ డివిజన్‌గా మార్పు చేశారు.

మార్పులు జ‌రిగేవి ఇవీ..

+ కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాలకు రెవెన్యూ అధికారులు బ‌దిలీ అవుతారు.

+ కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల‌కు స‌రిహ‌ద్దులు మార‌తాయి.

+ కొత్త మండ‌లాల్లోనూ అధికారాల మార్పు జ‌రుగుతుంది.

+ క‌లెక్ట‌ర్‌, డిప్యూటీ క‌లెక్ట‌ర్ నుంచి ఆర్డీవో వ‌ర‌కు డిసెంబ‌రు 31వ తేదీ నుంచి మారుతారు.

+ అయితే.. ఆయా జిల్లాలు, మండ‌లాల‌కు కొత్త‌గా అధికారుల‌ను త్వ‌ర‌లోనే నియ‌మించ‌నున్నారు.

+ నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. అన్ని కార్యాల‌యాల విభ‌జ‌న ప్ర‌కారం.. బోర్డులు ఏర్పాటు చేయ‌నున్నారు.