Begin typing your search above and press return to search.

మూడు జిల్లాలకు లైన్ క్లియర్! తిరుపతి జిల్లాలో మార్పులు?

ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   26 Dec 2025 8:08 PM IST
మూడు జిల్లాలకు లైన్ క్లియర్! తిరుపతి జిల్లాలో మార్పులు?
X

ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసేందుకు గత నెల 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై పెద్దగా అభ్యంతరాలు లేకపోగా, తిరుపతి జిల్లాలో ఉన్న మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వానికి వినతలు పంపినట్లు తెలుస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రజాభిప్రాయాన్ని తెలియజేశారని అంటున్నారు.

దీంతో గతంలో తిరుపతి జిల్లాలో కలిపిన మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు. మూడు కొత్త జిల్లాలతోపాటు, ఆరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, గూడూరు డివిజన్ లో ఉన్న కలువాయి, సైదాపురం, రావూరు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చాయి. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ మూడు మండలాలను తిరుపతి జిల్లా పరిధిలోని గూడూరు డివిజన్ లో కలిపారు. దీంతో ఆ మండల వాసులకు జిల్లా కేంద్రం దూరమైందని భావనతో ఆందోళనలు నిర్వహించారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆయా మండలాల వాసులు నిరసిస్తున్నారని చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆ మూడు మండలాల ప్రజల ఆందోళనలను తెలుసుకుని ఆశ్చర్యపోయారంటున్నారు. ప్రజలు అంతలా వ్యతిరేకిస్తున్నా, తిరుపతి జిల్లాలో ఎందుకు కలపాల్సివచ్చిందో తెలుసుకోవాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రజల అభ్యంతరాలతో కలువాయి, సైదాపురం, రావూరు మండలాలను నెల్లూరులో విలీనం చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నోటిఫికేషన్ ప్రకారం 27వ తేదీ శనివారంతో ప్రజాభిప్రాయం తెలుసుకునే గడువు పూర్తవుతుందని చెబుతున్నారు. 28న జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం అవుతుందని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలపై నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతోపాటు మూడు మండలాలను తిరిగి నెల్లూరులో కలపడం, కర్నూలు జిల్లాలోని అదోని మండలాన్ని విభజించడంపై ఆ రోజు ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు.

గతంలో ప్రతిపాదించిన విధంగా ఆదోని మండలాన్ని రెండుగా విభజంచే ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ మండలంలోని సుమారు 17 గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే పెద్ద హరివాణం మండలంలో కలపనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రతిపాదిత కొత్త మండలంపై రెండు మూడు గ్రామాల వారు మాత్రమే సానుకూలంగా ఉన్నారని, మిగిలిన గ్రామాల వారు వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. కొత్తగా ఏర్పాటయ్యే పెద్ద హరివాణం మండల కేంద్రం ఆయా గ్రామాలకు 40 కి.మీ. దూరం ఉండటం, అక్కడికి వెళ్లాలన్నా అదోని వచ్చి వెళ్లాల్సిన పరిస్థితిని గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో అదోని మండల విభజనను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు.