కొత్త జిల్లాల ప్రకటన అపుడే...డిమాండ్లు చాలానే !
ఇక ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల ప్రకటనతో పాటు పునర్ వ్యవస్థీకరించిన విధానాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు. దాంతో ఆనాటి నుంచి కొత్త జిల్లాలు ఏపీలో అమలులోకి వస్తాయని అంటున్నారు.
By: Satya P | 11 Nov 2025 6:00 AM ISTఏపీలో కొత్త జిల్లాల ప్రకటనకు డెడ్ లైన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాలుగా ఎన్ని రాబోతున్నాయన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో ఉన్న 26 జిల్లాల స్వరూప స్వభావాలు మార్పు చేర్పులు ఏ విధంగా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. కొత్త జిల్లాలను 22లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆనాటికి 13 ఉమ్మడి జిల్లాలు ఉండేవి. వాటిని డబుల్ చేశారు. అయిత పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రమాణంగా తీసుకుని చేసిన ఈ విధానంలో శాస్త్రీయత లేదని కూటమి నేతలు అప్పట్లో విపక్షంలో ఉన్నపుడు ఆరోపించారు. తాము కనుక అధికారంలోకి వచ్చినట్లు అయితే ఆ లోపాలను సవరిస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాని మేరకే ఇపుడు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది.
ఉప సంఘంతో కసరత్తు :
ఇక కూటమి ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని జిల్లాల పునర్ విభజన తో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసింది. రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ ఉప సంఘం ఏర్పాటు అయింది. ఇదిలా ఉంటే ఉప సంఘం ముందు ఎన్నో వినతులు ఫిర్యాదులు వచ్చాయి వాటిని క్రోడీకరించు కుంటూ అధ్యయనం చేస్తూ ముందుకు సాగింది. మరో వైపు చూస్తే తుది నివేదిక దాదాపుగా సిద్ధం అయింది అని వార్తలు వస్తున్నాయి.
ముహూర్తం అపుడే :
ఇక ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల ప్రకటనతో పాటు పునర్ వ్యవస్థీకరించిన విధానాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు. దాంతో ఆనాటి నుంచి కొత్త జిల్లాలు ఏపీలో అమలులోకి వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్నవి 26 అయితే ఆ సంఖ్య 32 అవుతుందా లేక 28 అవుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అమరావతి కొత్త జిల్లాగా ఏర్పాటు అవుతుంది అన్నది కూడా చర్చకు వస్తోంది. అలాగే మార్కాపురం తో పాటు మరికొన్ని డిమాడ్లు ఉన్నాయి. ఏది ఏమైనా కొత్త జిల్లాల మీద కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది అని అంటున్నారు.
ప్రమాణం ఇదేనా :
తాజాగా జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అనంతరం రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ కసరత్తు అని అన్నారు. అదే ప్రమాణం అన్నారు. రెవిన్యూ డివిజన్లు అన్నీ ఒకే జిల్లాలో ఉంటాయని అన్నారు. అదే విధంగా పాలనకు ఇబ్బంది లేకుండా ఈ పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీలో కొత్త జిల్లాలు మరో పాలనా సంస్కరణగా ముందుకు రాబోతున్నాయని అంటున్నారు.
