Begin typing your search above and press return to search.

కేంద్రం పథకం.. వదిలేసిన జగన్.. అడ్వాంటేజ్ తీసుకున్న చంద్రబాబు!

ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటాయి.

By:  Tupaki Desk   |   16 July 2025 2:00 AM IST
కేంద్రం పథకం.. వదిలేసిన జగన్.. అడ్వాంటేజ్ తీసుకున్న చంద్రబాబు!
X

ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటాయి. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలను కొన్ని రాష్ట్రాలు యథాతథంగా అమలు చేస్తే, కొన్ని ప్రభుత్వాలు కొన్ని మార్పులతో అమలు చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆ పథకాలు ఆయా రాష్ట్ర ప్రజలకు అందకుండా పోతాయి. ఇలాంటి ఓ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం చక్కని అవకాశంగా మార్చుకుని మంచిపేరు కొట్టేసిందని అంటున్నారు. 2023లో కేంద్రం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం ఏ కారణంగానో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందిపుచ్చుకుని మార్కులు కొట్టేస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనాథ పిల్లల సంక్షేమం కోసం ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఈ పథకం గొప్పవరంగా చెబుతున్నారు. ప్రతి నెల రూ.4 వేలు చొప్పున ఈ పథకంలో అనాథ పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వాస్తవానికి ఈ పథకానికి కేంద్రం రూపకల్పన చేసింది. 2023లోనే ప్రవేశపెట్టింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ పథకంపై ఆసక్తి చూపకపోవడంతో ఏపీలోని అనాథ పిల్లలు ఓ ఏడాది పాటు ప్రభుత్వ సాయానికి నోచుకోలేకపోయారు. సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పుకున్న జగన్ సర్కారు ఈ విషయంలో ఎందుకు విఫలమైందో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ పథకం కింద 60 శాతం భారాన్ని కేంద్రం, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రం భరించాల్సివుంటుంది.

అయితే చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం వదిలేసిన కేంద్ర పథకాలను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సుమారు 73 కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం.. కొన్నింటిని అమలు చేయడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని చాలా ప్రాధాన్యమిస్తోంది. ఈ పథకం కింద ఏ అండ లేని అనాథ పిల్లలకు రూ.18 ఏళ్లు వచ్చేవరకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఫలితంగా వారి చదువులతోపాటు ఇతరత్రా ఖర్చులకు సాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు లేని పిల్లలను పెంచడం భారంగా భావిస్తున్న బంధువులు.. ఈ పథకం వల్ల అనాథలను చేరదీస్తారని కూడా ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తోంది. ‘తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయి బంధువుల దగ్గర ఉంటున్న పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పిల్లలు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, యాసిడ్ దాడుల బాధితులు, వితంతువులు లేదా విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, పోషించడానికి డబ్బులు లేని తల్లిదండ్రుల పిల్లలు, బాలల న్యాయ చట్టం-2015 ప్రకారం సంరక్షణ అవసరమైన పిల్లలు, బాల కార్మికులు, బాల్య వివాహాలు జరిగిన పిల్లలు, హెచ్ఐవీ ఉన్న పిల్లలు, వికలాంగులు, తప్పిపోయిన పిల్లలు, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, హింసకు గురైన పిల్లలు, అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు’ మిషన్ వాత్సల్య పథకానికి అర్హులు.

కరోనా సమయంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు కోసం ఈ పథకాన్ని కేంద్రం రూపొందించింది. తర్వాత ఏ విధంగానైనా అనాథలు, అభాగ్యులుగా ఉన్నవారిని ఆదుకోవాలని నిర్ణయించింది. తన వాటాగా 60 శాతం చెల్లించేందుకు ముందుకొచ్చింది. అయితే మిగిలిన 40 శాతం భరించేందుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ‘మిషన్ వాత్సల్య’ను అమలు చేసేందుకు పెద్దఎత్తున ప్రణాళిక రచిస్తోంది. 2023లో ఈ పథకం కింద అర్హులను గుర్తించి ఇప్పటికే రెండు విడతలుగా నగదు చెల్లించింది. ఫిబ్రవరి 5న ఒకసారి, ఈ నెల 5న మరోసారి మిషన్ వాత్సల్య డబ్బు జమచేసినట్లు అధికారులు చెబుతున్నారు.