Begin typing your search above and press return to search.

మంత్రులపై కుట్ర? ఒకేసారి నలుగురికి బెదిరింపు లేఖలు!

బెదిరింపు లేఖలపై మంత్రి దుర్గేశ్ చెప్పగానే సచివాలయంలో కలకలం రేగింది. లేఖలు అందిన వారిలో ఇద్దరు టీడీపీకి చెందిన మంత్రులు కాగా, బీజేపీ, జనసేన నుంచి ఒక్కో మంత్రికి లేఖలు వచ్చాయి.

By:  Tupaki Political Desk   |   11 Feb 2026 2:11 PM IST
మంత్రులపై కుట్ర? ఒకేసారి నలుగురికి బెదిరింపు లేఖలు!
X

ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జాగ్రత్తగా ఉండాలి’ అంటూ అజ్ఞాత వ్యక్తులు బెదిరిస్తూ లేఖలు రాశారు. నాలుగు లేఖలు ఒకరి నుంచే వచ్చినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల హిట్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయంటూ పోస్టు ద్వారా ఆ లేఖలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం నాడే ఈ లేఖలు అందగా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయ సిబ్బంది వెంటనే రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు పోలీసుస్టేషన్ లో ఫిర్యదు చేసినట్లు చెబుతున్నారు.

మంత్రి దుర్గేశ్ తోపాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఈ బెదిరింపు లేఖలు వచ్చాయని అంటున్నారు. బుధవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్ సందర్భంగా మంత్రి దుర్గేశ్ బెదిరింపు లేఖలు అందిన విషయాన్ని ధ్రువీకరించారు. అయితే ఆ లేఖలు మావోయిస్టులు రాసినట్లు లేవని, ఎవరో భయపెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా లేఖలు రాసివుంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఒకేసారి నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు రావడంపై ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బెదిరింపు లేఖలపై మంత్రి దుర్గేశ్ చెప్పగానే సచివాలయంలో కలకలం రేగింది. లేఖలు అందిన వారిలో ఇద్దరు టీడీపీకి చెందిన మంత్రులు కాగా, బీజేపీ, జనసేన నుంచి ఒక్కో మంత్రికి లేఖలు వచ్చాయి. ఎవరో ప్రణాళిక ప్రకారమే ఇలా మూడు పార్టీల వారికి లేఖలు రాసి భయపెట్టాలని ప్రయత్నం చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చిన దాఖలాలు లేవని అంటున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన తర్వాత ఇటువంటి లేఖలు రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరోవైపు మంత్రి దుర్గేశ్ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. సచివాలయంలో మంత్రులకు భద్రత పెంచడమే కాకుండా, వారి సొంత నియోజకవర్గాలలోనూ అలర్ట్ గా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. లేఖలు రాసినది ఎవరు? అన్న విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయని అంటున్నారు. ఏపీలో మావోయిస్టు కదలికలు అసలు లేవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. షెల్టర్ జోన్ గా మావోయిస్టులు రాష్ట్రం వైపు వస్తున్నా, గత ఏడాది నవంబరులో మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటరులో అగ్రనేత హిడ్మా మరణించడం, అదే సమయంలో విజయవాడ ఏలూరు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులను అరెస్టు చేశారు. ఈ సంఘటనల తర్వాత మావోయిస్టులు రాష్ట్రం వైపు చూడటమే మానేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, అజ్ఞాత వ్యక్తులు నలుగురు మంత్రులను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడానికి కారణాలు ఏమైవుంటాయని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. లేఖలు అందుకున్న నలుగురు మంత్రులు సౌమ్యులుగానే గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. నియోజకవర్గాల్లో కూడా వివాదాస్పద అంశాల్లో తలదూర్చినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం లేదని, అలాంటి ఆ నలుగురిని టార్గెట్ చేస్తూ లేఖలు రాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసు అధికారులు వాకబు చేస్తున్నారని అంటున్నారు.