Begin typing your search above and press return to search.

దసరాలోగా స్థానిక ఎన్నికలు.. మొత్తం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి!

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వచ్చేనెలలో ఎట్టి పరిస్థితులల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తోందని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2026 6:42 PM IST
దసరాలోగా స్థానిక ఎన్నికలు.. మొత్తం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి!
X

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వచ్చేనెలలో ఎట్టి పరిస్థితులల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తోందని చెబుతున్నారు. మున్సిపాలిటీలతో ప్రారంభించి పంచాయతీలతో ఎన్నికలు ముగించేలా షెడ్యూల్ సిద్దం చేయాలని ఎన్నికల కమిషన్ కు సమాచారం పంపిందని అంటున్నారు. ప్రభుత్వం ఇంత హడావుడిగా ఎన్నికలు జరిపించాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియే అంటున్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతోంది. అక్టోబరు 3న ఈ ప్రక్రియ పూర్తవుందని అంటున్నారు. ఆ రోజు కొత్త ఎన్నికల జాబితా ప్రకటిస్తారని, ఆ లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.

వచ్చేనెలలో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. అక్టోబరులో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వస్తే ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే ఆలోచనతోనే ప్రభుత్వం పాత ఓటర్ల జాబితా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాలకు నాలుగు నెలల క్రితమే గడువు పూర్తవగా, జడ్పీ, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలకు త్వరలో గడవు ముగియనుంది. దీంతో సెప్టెంబరులో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

అక్టోబరు వరకు ఎన్నికలు నిర్వహించకపోతే, కొత్త ఓటర్ల జాబితాతో వార్డులు పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేయాల్సివుంటుందని, దీనికి మరో మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను ముగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని పెండింగు పనులు పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుండగా, ఇంతవరకు కొత్తగా ఏ ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదని అంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో కొంత ఇబ్బంది తలెత్తుతుందని టీడీపీ కూటమి కార్యకర్తలు ఆందోళనలు చెందుతుండగా, వచ్చేనెలలో పింఛన్ల దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.

మొత్తానికి వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సెప్టెంబరులో తొలివారంలో అన్ని ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని, రెండో లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వారంలో జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు, చివరి వారంలో పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కో ఎన్నికకు సుమారు 20 రోజులు పడుతుందని ఈ విధంగా అక్టోబరు 15 లేదా 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ స్పీడుకు పెంచిన బీసీ రిజర్వేషన్ల అంశం అడ్డుగా నిలిచే పరిస్థితి ఉందని భయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో న్యాయపరంగా చిక్కులు ఎదురైతే ఏం చేయాలన్న దానిపైనా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, అవసరమైతే ప్లాన్-బి అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు.