50 శాతానికి మించి స్థానిక రిజర్వేషన్లు! చంద్రబాబు వ్యూహం ఏంటి?
అయితే పెంచిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 దాటుతున్నాయని, సుప్రీం తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 15 Sept 2026 5:00 PM ISTరాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే పెంచిన బీసీ రిజర్వేషన్ల వల్ల అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతన్నాయని చెబుతున్నారు. వచ్చేనెల 3న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తున్నందున ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఈ దిశగా ఎన్నికల సంఘం ఇప్పటికే పలు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు వార్డుల విభజనపై నోటిఫికేషన్లు జారీ చేసిందని చెబుతున్నారు. అయితే పెంచిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 దాటుతున్నాయని, సుప్రీం తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఉందని వాదిస్తోంది. దీంతో షెడ్యూల్ ప్రకటన వచ్చేవరకు స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటనున్నాయని అంటున్నారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 55 శాతం అవుతాయని అంటున్నారు. ఇది సుప్రీంకోర్టు గత తీర్పులకు వ్యతిరేకంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా న్యాయసమీక్షకు వెళితే ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది టెన్షన్ పుట్టిస్తోందని చెబుతున్నారు.
నిజానికి రిజర్వేషన్లు పెంచాల్సివస్తే డెడికేడెట్ కమిషన్ నియమించి ఆ కమిషన్ సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం గతంలో తీర్పునిచ్చిందని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై సూచనలు చేయాలని ప్రభుత్వం కోరింది. తొలుత ఆగస్టు 31 వరకు ఈ కమిషన్ కు గడువు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గడువు తేదీని సెప్టెంబరు 30వ తేదీకి పెంచింది. అయితే ఆగస్టు నెలలో కమిషన్ ప్రాథమిక నివేదికలో బీసీ రిజర్వేషన్లను 28 శాతానికి పెంచుకోవ్చని సిఫార్సు చేసినట్లు ప్రచారం జరిగింది.
అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మొండిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటనలు చేయడమే ఉత్కంఠకు గురిచేస్తోందని చెబుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కూడా 34 శాతంతో ఎన్నికలు నిర్వహించడానికి ఆ రాష్ట్రప్రభుత్వం ప్రయత్నించగా, కోర్టులు అడ్డుకున్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం 34 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతుండటమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం ఏ విధంగా చెప్పినా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతుండటం వల్ల కోర్టులు అంగీకరిస్తాయా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోందని అంటున్నారు. అయితే కోర్టులు అంగీకరించేలా ప్రభుత్వం ఏమైనా మేజిక్ చేస్తుందా? అంటూ పరిశీలకులు ఎదురుచూస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో రిజర్వేషన్ పెంచుకునేందుకు వీలుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వాదనలపై అధ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల వేడి రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.
