వైసీపీ ఎఫెక్ట్: స్థానిక పోరు రెఫరెండమేనా ..!
అయితే..ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. తీసుకుంటామని వైసీపీ ప్రకటించింది.
By: Garuda Media | 26 Aug 2026 7:00 PM ISTఅక్టోబరు చివరి నాటికి మునిసిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 16వ ఆర్థిక సంఘం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని కూడా ఆయన చెప్పారు. దీంతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్వరలోనే పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇక, ఈ ఎన్నికలకు ప్రస్తుతం పూర్తయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియకు బదులుగా ఈ ఏడాది జనవరి నాటికి ఉన్న ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇదీ ఇతమిత్థంగా ఎన్నికల ప్రక్రియ.
అయితే..ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. తీసుకుంటామని వైసీపీ ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నాయకులకు లక్ష్యాలను కూడా నిర్దేశించారు. ఈ ప్రభావం కూటమిపై స్పష్టం గా కనిపిస్తోంది. తమకు గత ఎన్నికల్లో 40 శాతం మేరకు ఓటు బ్యాంకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంతకుమించి ఓట్లు రావాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. దీనికి ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కారణంగా చూపిస్తు న్నారు. ప్రజల మధ్యకు వైఫల్యాలను తీసుకువెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు.
ఇక, పైకిరెఫరెండం అని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చెప్పకపోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఈ ఎన్నికలు.. గత రెండున్నరేళ్ల పాలన, తీసుకువచ్చిన పెట్టుబడులు.. చేసిన సంక్షేమం, అభివృద్ధి వంటివాటికి ప్రామాణికంగా మారుతాయన్న చర్చ ఉంది. ముఖ్యంగా జగన్ చేయలేనిది తాము చేసి చూపించామని అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు సహా నాయకులు చెబుతున్నారు.ఇక, ఉద్యోగాల కల్పన, డీఎస్సీ వంటివి కూడా తమకు అనుకూలంగా మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
దీనిని బట్టి ఒకరకంగా స్థానిక ఎన్నికల్లో గతంలో వచ్చిన అంటే.. 2024 ఎన్నికల్లో లభించిన 59 శాతం ఓటు బ్యాంకు కంటే కూడా ఎక్కువగా రావడంతో పాటు.. స్థానికంలో పాగా వేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. క్షేత్రస్థాయిలో ఈ మేరకు ఓటు బ్యాంకు పెరిగితే.. అది ఖచ్చితంగా రెఫరెండంగానే భావిస్తామని నాయకులు చెబుతున్నారు. పెరుగుతుందన్న ఆశావాదాన్ని కూడా వినిపిస్తున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటు విషయంలో కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. అనుకున్నదిశగా అడుగులు వేసేందుకు ఛాన్స్ లభిస్తుందనడంలో సందేహం లేదు.
