Begin typing your search above and press return to search.

ఏపీ మద్యం కేసులో తొలి బెయిల్‌..! మిథున్‌, ఇత‌రుల‌ పరిస్థితి ఏమిటో?

ఏపీలో రాజ‌కీయంగా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది మ‌ద్యం విధానం కేసు. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హించింద‌ని, అప్పుడు రూ.3,500 కోట్లకు అవినీతి జ‌రిగింది ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కేసు న‌మోదు చేసింది.

By:  Tupaki Desk   |   1 Sept 2025 9:10 AM IST
ఏపీ మద్యం కేసులో తొలి బెయిల్‌..! మిథున్‌, ఇత‌రుల‌ పరిస్థితి ఏమిటో?
X

ఏపీలో రాజ‌కీయంగా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది మ‌ద్యం విధానం కేసు. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హించింద‌ని, అప్పుడు రూ.3,500 కోట్లకు అవినీతి జ‌రిగింది ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కేసు న‌మోదు చేసింది. దీనిపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే, ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాలు నిర్వ‌హిస్తే ఇక అవినీతి ఎక్క‌డ‌ని, తాము బెల్టు షాపుల‌ను ఎత్తివేశామ‌ని, అమ్మ‌కం వేళ‌ల‌ను కుదించామ‌ని, కొత్త‌గా డిస్టిల‌రీల‌కు అనుమ‌తే ఇవ్వ‌లేద‌ని, ఇక కుంభ‌కోణం ఎలా జ‌రుగుతుంద‌ని వైఎస్సార్సీపీ ప్ర‌శ్నిస్తోంది. త‌మ నాయ‌కుల‌ను వేధించేందుకు న‌మోదు చేస్తున్న‌వ‌న్నీ అక్ర‌మ కేసులేన‌ని ఆరోపిస్తోంది. అయితే, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయిన‌ట్లు అరెస్టు చేసింది. నిందితుల‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కోర్టు రిమాండ్ విధించింది.

రిమాండ్ లో ఎంద‌రో?

మద్యం కేసు చుట్టూ మీడియాలో ఎన్నో కథనాలు. అధికార టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే మీడియాలో ఒకలా.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన మీడియాలో ఒకలా.. క‌థ‌నాలు వ‌స్తున్నాయి. రెండూ నమ్మే విధంగానే ఉంటున్నాయి.. రెండూ ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇక సిట్ అరెస్టుల్లో వైసీపీకి చెందిన‌ పెద్ద నాయ‌కులు ఉన్నాయి. ఆ పార్టీలో నంబర్ 2గా భావించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జ‌గన్ కు అత్యంత స‌న్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రిటైర్డ్ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, ఓఎస్డీగా ప‌నిచేసిన క్రిష్ణ‌మోహ‌న్ రెడ్డి, గ‌త స‌ర్కారులో ఐటీ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన రాజ్ క‌సిరెడ్డి ఉన్నారు. వీరంతా ప్ర‌స్తుతం రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా మంజూరు కావ‌డం లేదు.

ఎట్ట‌కేల‌కు ఒక‌రికి...

ఏపీ మద్యం కేసులో తాజాగా దిలీప్ కు బెయిల్ వ‌చ్చింది. ఈ కేసులో బెయిల్ ఇదే. దిలీప్ 30వ నిందితుడిగా ఉన్నారు. 125 రోజులు జైలులో గ‌డిపారు. ఆయ‌న త‌ర‌ఫున లాయ‌ర్లు వాదిస్తూ.. దిలీప్ పై సిట్ ఆధారాలు చూప‌లేద‌ని, ద‌ర్యాప్తు అధికారులు సాక్షులు అంద‌రినీ విచారించి ద‌ర్యాప్తు పూర్తిచేశార‌ని కోర్టులో వాద‌న‌లు వినిపించారు. అయితే, మ‌ద్యం కేసులో రాజ్ క‌సిరెడ్డి (ఏ1), శ్రీధర్‌రెడ్డి (ఏ6)లు దాఖలుచేసిన బెయిల్‌ పిటిషన్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి.

మిథున్ కోసం రెండు విధాలా..

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడైన మిథున్ రెడ్డికి బెయిల్ ప‌లుసార్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఆయ‌న త‌ర‌ఫున మ‌ధ్యంత‌ర‌, రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ప్రాసిక్యూష‌న్ కు నోటీసులు ఇవ్వాల‌ని ఆదేశిస్తూ వీటిపై సెప్టెంబ‌రు 5కు విచార‌ణను వాయిదా వేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిష‌న్ పై వ‌చ్చే శుక్ర‌వారం ప్రాసిక్యూష‌న్ కు నోటీసులు ఇవ్వ‌నున్నారు. క్రిష్ణ‌మోహ‌న్ రెడ్డి చ‌ట్ట‌బ‌ద్ధ బెయిల్ పిటిష‌న్ పై స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు నోటీసులిస్తూ సోమ‌వారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలన్నారు. మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ సోమ‌వారానికి వాయిదా వేశారు.

-మద్యం కేసులో బాలాజీకుమార్‌ యాదవ్‌ను అరెస్టు చేసే సమయంలో సిట్ రూ.3 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఈ డ‌బ్బ‌ను రిలీజ్‌ చేయాలని పిటిషన్ వేయ‌గా దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సోమ‌వారానికి వాయిదా వేశారు. బాలాజీ దగ్గర సీజ్‌ చేసిన డబ్బు.. మద్యం కేసుదిగా పరిగణించాలని సిట్ వేసిన పిటిషన్‌పైనా సోమ‌వారం విచారణ జ‌ర‌గ‌నుంది.