సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది?
ఇంతకూ సదరు రిమాండ్ రిపోర్టులో ఏం పేర్కొన్నారు? విచారణలో శ్రీధర్ రెడ్డి ఏయే అంశాల్ని ప్రస్తావించారన్న అంశానికి సంబంధించి కీలక పాయింట్లు ఇవే..
By: Tupaki Desk | 27 April 2025 9:55 AM ISTవేలాది కోట్ల రూపాయిలు కొల్లగొట్టినట్లుగా పేర్కొంటూ.. ఏపీ మద్యం కుంభకోణంలో పలువురి పాత్ర ఉందంటూ సిట్ చేస్తున్న ఆరోపణల గురించి తెలిసిందే. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు తాజాగా ఎస్పీవై అగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈ స్కాంలో ఏ6గా పేర్కొంటూ అరెస్టు చేయటమే కాదు.. విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ కు తరలించారు. లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమన్న విషయాన్ని కోర్టుకు తెలిపిన అధికారులు.. తాము సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేశారు.
ఇంతకూ సదరు రిమాండ్ రిపోర్టులో ఏం పేర్కొన్నారు? విచారణలో శ్రీధర్ రెడ్డి ఏయే అంశాల్ని ప్రస్తావించారన్న అంశానికి సంబంధించి కీలక పాయింట్లు ఇవే..
- ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా ఐదేళ్ల పాటు వసూలు చేసిన మద్యం ముడుపుల ప్లానింగ్ మొదలు పలు వ్యవహారాల్లో శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే హైదరాబాద్ లోని కసిరెడ్డి ఆఫీసులో మీటింగ్ జరిగింది.
- ఏపీ మద్యం వ్యాపారులతో జరపాల్సిన చర్చలు.. అడగాల్సిన కమీషన్ల శాతం ఖరారు చేశారు. ఆ తర్వాత వైసీపీకి చేకూర్చాల్సిన ఆదాయంపైనా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మద్యం వ్యాపారులను పలుమార్లు స్టార్ హోటళ్లు.. ప్రైవేటు గెస్టు హౌస్ లకు పిలిపించి 12 శాతం కమిషన్ ను డిమాండ్ చేశారు.
- ఫైనల్ గా జూన్ 2019లో పార్క్ హయత్ హోటల్లో కసిరెడ్డి.. ఆయన బావమరిది ముప్పిడి అవినాశ్ రెడ్డి అలియాస్ సుమిత్.. కొందరు డిస్టలరీస్ ప్రతినిధులతో కలిసి శ్రీధర్ రెడ్డి ప్లాన్ చేశారు. 2019లో అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి జూబ్లీహిల్స్ ఇంట్లో కీలక సమావేశం జరిగింది.
- ఈ సమావేశంలో సత్యప్రసాద్.. కసిరెడ్డి.. మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. జూన్ - అక్టోబరు మధ్య లిక్కర్ వ్యాపారులతో జరిపిన చర్చల సారాంశాన్ని విశ్లేషించి.. కమీషన్లకు అంగీకరించని లిక్కర్ బ్రాండ్ల అణచివేత.. అంగీకరించిన వారికి ప్రోత్సాహం.. కమిషన్ల విధానాలే ఎజెండాగా మీటింగ్ జరిగింది.
- 2019లో అప్పటి సీఎం జగన్ సూచన మేరకు అరబిందో గ్రూపు కంపెనీలు ఎస్పీవై ఆగ్రోస్ పునరుద్ధరణకు రూ.45 కోట్లు సమకూర్చాయి. లిక్కర్ సరఫరాకు కొత్తగా పుట్టుకొచ్చిన ఆదాన్ సంస్థకు మరో రూ.60 కోట్లు ఇచ్చాం. నిజానికి ఎస్‌పీవై ఆగ్రోస్‌కు అరబిందో నుంచి రూ.37 కోట్లు మాత్రమే ఇచ్చాం. మిగిలిన రూ.8 కోట్లు ముడుపుల రూపంలో ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన సంస్థల్లో దారి మళ్లించాం.
- ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ సన్ హోక్ ల్యాబ్స్ నుంచి నేరుగా రూ.15 కోట్ల రుణమే పొందింది. మరో రూ.22 కోట్లు డీకార్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా చెల్లించింది. ఈ డీకార్ట్ సంస్థ రాజ్ కసిరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిది.
- భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా మిథున్‌రెడ్డి ఆ డబ్బులు వెనక్కి ఆన్‌లైన్‌లో చెల్లించి తర్వాత నగదు రూపంలో తీసుకున్నారు. అయితే అరబిందో నుంచి తీసుకున్న డబ్బులు ప్రతి నెలా రూ.కోటి చొప్పున 2022 వరకూ చెల్లించా. ఆ తర్వాత అంతర్గత విభేదాలతో బయటికి వెళ్లిపోయా. డబ్బులు తిరిగి చెల్లించలేదు. అప్పటి నుంచి ఎస్పీవై ఆగ్రోస్ యజమానిగా నేను లేను.
- ఎస్పీవై ఆగ్రోస్ నుంచి ఓల్విక్, కృపతి, నైస్నా, బాలాజీ ట్రేడిండ్, వెంకటేశ్వర ప్యాకేజింగ్, విషాల్ ఎంటర్‌ప్రైజెస్ వంటి షెల్ కంపెనీలు లావాదేవీలు జరిపాం. ఈ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిపి అక్కడి నుంచి మద్యం చైన్ చెలామణి చేశాం.
- మద్యం మాఫియా నుంచి సేకరించిన నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లించాం. వైసీపీలోని పెద్ద నాయకుడికి మొత్తం ప్రణాళిక వివరించి ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు ఏపీఎస్‌బీసీఎల్‌కు అధికారం ఇస్తూ కొత్తగా జీవో జారీ చేయించాం.ఈ పనులన్ని పక్కాగా చేసేందుకు నమ్మకస్థులైన వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్‌ను కీలక స్థానాల్లో ఎంపిక చేశాం.
- రాష్ట్రంలో మద్యం విక్రయాల సాఫ్ట్‌వేర్‌ను 50 శాతం మేర రద్దు చేసి, మాన్యువల్ ఆర్డర్ ఫార్మ్ వ్యవస్థను తెచ్చాం. నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చాం.
- ఎస్సీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు రూ.45 కోట్లు.. అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.60 కోట్ల మేర హామీ లేని రునాన్ని ఇవ్వాలని అరబిందో గ్రూపు కంపెనీలను ఆదేశించింది నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. జగన్ తో తనకున్న సంబంధాల్ని అడ్డం పెట్టుకొని రాజ్ కసిరెడ్డి అదాన్ డిస్టలరీస్ ను ప్రారంభించాం. అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీల్లో ఇదే కీలకమైనది.
