ఆంధ్రులకు తరతరాల అన్యాయం...ఇదేమని అడగలేని దైన్యం !
ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ అమరావతికి వచ్చి రాజధాని పనులను తిరిగి ప్రారంభించారు. ఒక విధంగా చూస్తే ఇది శుభారంభం.
By: Tupaki Desk | 4 May 2025 2:00 AM ISTఆంధ్రులను ఆరంభశూరులు అని అంటారు. ఎందుకు అంటే వారిలో ఆవేశం పాళ్ళు హెచ్చు. దాంతో తొందరగా బయటపడిపోతారు. అయితే ఆ ఆవేశం పాల పొంగు లాంటిది. దాంతో పంతం నెగ్గించుకోకుండానే పట్టు కూడా జారిపోతుంది. ఆంధ్రుల విషయంలో ఎపుడూ కేంద్రం సవతి తల్లి ప్రేమనే చూపిస్తూ వస్తోంది అని అంతా అంటారు. దానికి ఉదాహరణలు అనేకం చెబుతారు.
ఇదిలా ఉంటే తరతరాలుగా ఆంధ్రులకు జరిగిన అన్యాయం ఏమిటీ ఈ రోజుకీ అది ఎందుకు కొనసాగుతోంది అన్నది చూస్తే కనుక ఐక్యంగా ఆంధ్రులు ఉండలేకపోవడం, తాము అనుకున్నది హక్కులుగా వచ్చినవి సాధించుకోలేకపోవడం అని చెప్పాలి. అందుకే కేంద్రం సైతం ఆంధ్రాను అలా చూస్తూ వదిలేస్తోంది అని అంటారు.
ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ అమరావతికి వచ్చి రాజధాని పనులను తిరిగి ప్రారంభించారు. ఒక విధంగా చూస్తే ఇది శుభారంభం. అయితే అలా వచ్చిన కేంద్ర పెద్ద ఏపీకి ఏమైనా వరాలు ఇచ్చారా అంటే లేనే లేదు అమరావతి రాజధానికి రుణం మాత్రం కేంద్రం దగ్గర ఉండి ఇప్పించింది.
మరి అదే రుణం చంద్రబాబు తెచ్చుకోలేరా అన్నది కూడా అతి పెద్ద ప్రశ్న. బాబుకు ఉన్న పలుకుబడితో ఆయన ప్రపంచబ్యాంక్ నుంచి నేరుగానే రుణాలను తెచ్చుకోగలరు. అంతే కాదు ప్రపంచంలో ఉన్న అనేక ఏజెన్సీల నుంచి కూడా ఆయన నిధులను సమకూర్చుకోగలరు.
కానీ కేంద్రం ఈసారి ఏపీ మీద పెద్ద మనసు చూపించినట్లుగా అమరావతి వర్ధిల్లాలి అని అంటోంది. మోడీ సభలో ఆశీస్సులు మాత్రమే ఇచ్చారు కానీ నిధులు విదిలించలేకపోయారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీ ఉమ్మడిగా ఉన్నపుడు అందరి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అది మన సొంతం అనుకుని నాడు ఏపీలోని 23 జిల్లాలూ కలసి అభివృద్ధి చేశాయి. అందులో 13 జిల్లాలను వేరు చేసి మీకు రాజధాని లేదు అని 2014లో విభజించారు. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణాలో ఉన్నందువల్ల అది వారి రాజధాని అయింది.
సరే దానికి కూడా ఆంధ్రులు అంగీకరించారు. కానీ ఏపీకి రాజధాని లేదు కదా ఆ విధంగా చేసి కాంగ్రెస్ విడగొడితే మద్దతు ఇచ్చిన పార్టీగా తాము తర్వాత అధికారంలోకి వచ్చాం కదా అని బీజేపీ అనుకోలేదు. పైగా విభజన చట్టంలో రాసి పెట్టినట్లుగా ఏపీకి రాజధానిని నిర్మించి ఇస్తామన్న బాధ్యతను హామీని కూడా పక్కన పెట్టేసింది అన్న విమర్శలు ఉన్నాయి.
ఏపీలో ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పిన పెద్దల మాటలు కూడా నెరవేరలేదు. ఏపీకి పదకొండేళ్లు అయినా ఈ రోజుకీ రాజధాని అన్నది లేదు. ఇక ఈ రోజు అయినా వేల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి పనులు ప్రారంభించాల్సి వస్తోంది.
అమరావతి రాజధానికి అయ్యే నిధులను అప్పులుగా కాకుండా గ్రాంట్ రూపంలో ఇస్తామని కేంద్రం ఎందుకు చెప్పలేకపోతోంది అన్నది ప్రధాన ప్రశ్న. ఒక్కసారి కాదు కనీసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు వంతున అయిదేళ్ళకూ యాభై వేల కోట్లు ఇచ్చినా ఎపీ రాజధాని దివ్యంగా రూపుదిద్దుకుంటుంది.
ఏడాదికి 50 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశ పెడుతున్న కేంద్రానికి ఏటా ఏపీకి పది వేల కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ ఏపీని అప్పులు చేసుకునే రాజధాని కట్టుకోమని చెప్పడం ఏ రకమైన న్యాయం అని అంతా అంటున్నారు.
మరి కాస్తా వెనక్కి వెళ్తే ఇక ఉమ్మడి మద్రాస్ రాష్ట్రలో ఆనాటి ఆంధ్ర రాష్ట్రం ఉంది. అపుడు కూడా మద్రాస్ మన సొంత రాజధాని అనుకుని ఆంధ్రులు అభివృద్ధి ఎంతో చేశారు కానీ చివరికి రాజధాని లేకుండా 1953లో ఆంధ్రాని వేరు చేసి సొంత రాష్ట్రం ఇచ్చామని అన్నారు. అలా కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసుకుని మూడేళ్ళు జరిగాక అలా కాదు హైదరాబాద్ నే అందరి రాజధాని అని ఆ వైపుగా తీసుకెళ్ళింది ఆనాటి కేంద్ర పెద్దలే. ఇక 58 ఏళ్ళ పాటు ఆంధ్రుల రక్తం శ్రమ అన్నీ పెట్టేశాక 2014లో మీకు రాజధాని లేదు పొమ్మన్నారు.
ఇలా చూస్తే కనుక చారిత్రక అన్యాయం ఏపీకి దాదాపుగా డెబ్బై ఏళ్ళ పై నుంచి జరుగుతోంది. ఏపీ ఒకటి కాదు మూడు సార్లు మోసపోయింది. ఇపుడు కూడా గ్రాంట్స్ లేకుండా ఉత్త చేతులతో కేంద్రం దీవిస్తోంది. దాంతో ఎన్ని సార్లు ఇలా అన్యాయం కావాలని ఆంధ్రుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రోడ్ రైల్ కనెక్టివిటీని పెంచామని ఏపీకి ఎంతో చేస్తున్నామని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా కనెక్టివిటీని పెంచినపుడు అది తప్పనిసరిగా ఆంధ్రాకు రాకుండా ఉంటుందా అని అడుగుతున్నారు.
పైగా అన్ని రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు కదా అని ప్రశ్నిస్తున్నారు ఏపీకి ఏమైనా ప్రత్యేకంగా బులెట్ ట్రైన్ ఇచ్చారా అని కూడా నిలదీస్తున్నారు. చిత్రమేంటి అంటే ఏపీకి ఇంతలా అన్యాయం జరుగుతోంది అని తెలుస్తున్నా ఏ ఒక్కరూ నోరు ఎత్తకపోవడమే అసలైన దైన్యం. అందుకే కేంద్రం కూడా ఏపీని చూస్తోంది చోద్యం.
