దశాబ్దంలో ఎన్నడూ చూడని ఎండ? ఈ వేసవి మహా హాట్ గురూ..!!
ఏపీలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు.
By: Tupaki Political Desk | 5 March 2026 5:43 PM ISTఏపీలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికు వెళితే చెమటలు కక్కిస్తున్నాడు. మండుతున్న ఎండలతో బయట అడుగు పెట్టేందుకు కూడా జనం భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో భానుడు మరెంత మంట పుట్టిస్తాడోనంటూ బెంగ పెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని ప్రకటన చేసింది. గత దశాబ్దంలోనే ఎన్నడూ చూడని ఎండ ఈ ఏడాది ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
సహజంగా వేసవి అంటేనే ఎండలు మండిపోతాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. మార్చి మొదటి వారం నుంచే ఎండ ఎక్కువగా కాస్తుందని తన బులెటన్ లో ప్రకటించింది. అంతేకాకుండా వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించిందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
ఈ జిల్లాల్లో తీవ్రం
మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అంటున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు
ఎండలు ఎక్కువగా ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు వర్షాలు, పిడుగులు పడే సమయంలోనే ప్రజలకు ఎస్ఎంఎస్ ద్వారా ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు పంపేది. ఈ సారి ఎండలు అధికంగా కాస్తున్నందున ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో ఎండలు, వడగాల్పులపై అప్ డేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వడదెబ్బకు ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడొచ్చని భావిస్తోంది. ఎండ తీవ్రత అంచనాల నేపథ్యంలో జిల్లా అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై సమాచారం పంపనున్నారు. రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
సమాచారం కోసం టోల్ ఫ్రీ
అంతేకాకుండా ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచింది. 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ప్రజలు నేరుగా ఫోన్ చేసి ఎండతీవ్రతపై సమాచారం తెలుసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వల్ల ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండల నుంచి ముందుజాగ్రత్తగా ఇంటి వాతావరణం చల్లదనం కోసం పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మేడపైన మొక్కలు, ఇంట్లో మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిధంగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని అంటున్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని చెబుతున్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
