ఇది ఖచ్చితంగా బాబు రికార్డ్.. విషయం ఏంటంటే!
ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి కేవలం 10 నెలల్లోనే రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చింది.
By: Tupaki Desk | 6 April 2025 10:21 PM ISTఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి కేవలం 10 నెలల్లోనే రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చింది. దేశంలో వృద్ధి రేటు పెరుగుతు న్న రాష్ట్రాల్లో ఏపీ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుంది. వైసీపీ హయాంలో ఇది నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. తాజాగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల వృద్ధి రేటును అంచనా వేసిన.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని గణాంకాలు.. అంచనాల అమలు విభాగం ఆదివారం ఓ నివేదికను విడుదల చేసింది. దీనిలో రాష్ట్రాలు సాధించిన వృద్ధి రేటు.. ఆయా రాష్ట్రాలు ఏయే స్థానాల్లో ఉన్నాయన్న విషయాలను వెల్లడించింది.
గత 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే.. 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు 8.21 శాతంగా ఉన్నట్టు గణాంకాలు.. అంచనాల అమలు విభాగం తన నివేదికలో వెల్లడించింది. ఇక, ఈ నివేదికలో తమిళనాడు తొలిస్థానంలో నిలిచింది. ఇది 9.69 శాతం వృద్ధిని దక్కించుకుంది. కాగా.. గత ఏడాది కాలంలో ఏపీ వృద్ధి 2.02 శాతం పెరిగినట్టు కేంద్రం పేర్కొంది. అంటే.. వైసీపీ హయాంలో వృద్ధి రేటు.. 6.19 శాతంగా ఉందని తెలిపింది. ఇక, ప్రస్తుత డొమెస్టిక్ ధరల నివేదికలోనూ ఏపీ 12 శాతం వృద్ధిని కనబరిచింది.
అంతా మీదే..
ఈ నివేదిక విడుదలైన నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు.. సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. అంతా చంద్రబాబు దూరదృష్టి.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పెట్టుబడుల ఆహ్వానం.. అమరావతి రాజదాని నిర్మాణం, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేలా తీసుకుంటున్న చర్యలు వంటివి ఫలిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం.. ఇదంతా ఉమ్మడి కృషి అని పేర్కొనడం గమనార్హం. వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’ అన్న వ్యాఖ్యను జోడించారు.
ఏంటీ వృద్ధి రేటు?
వృద్ధి రేటు అంటే.. ప్రజల జీవన వ్యయాలు పెరగడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా మెరగవుతున్న రాష్ట్రాల్లో పెరిగిన అభివృద్ధిని అంచనా వేయడం. దీనిని ఆధారంగా చేసుకుని పెట్టుబడి దారులు ఆయా రాష్ట్రాలకు వస్తారు. గతంలో ఇది తక్కువగా ఉండడంతోనే ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న వాదన ఉంది. ఇప్పుడు పెట్టుబడి దారులకు మార్గం సుగమం కావడం వెనుక.. వృద్ధి రేటు మెరుగు పడడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
