'రిపోర్టు' ను వదిలేయడమే కూటమి పెద్ద మిస్టేక్.. !
సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది.
By: Garuda Media | 8 Feb 2026 4:00 AM ISTకూటమి ప్రభుత్వంలో మేధావులు ఉన్నారు. సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఇక, సలహాలు ఇచ్చేవారు.. పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహాలు పన్నేవారు కూడా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాశి ఎక్కువగా ఉంది.. కానీ, వాసి మాత్రం తక్కువగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆరోపణలు.. ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితం అయిన.. నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తే.. రిపోర్టును ఆలంబనగా చేసుకుని అడుగులు వేయొచ్చు.
సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అసలు అది నెయ్యే కాదని కూడా పేర్కొంది. సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని కూడా కమిటీ పేర్కొంది. ఈ ఒక్క విషయం ప్రభుత్వానికి ఒకరకంగా వజ్రాయు ధమే. దీనిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లొచ్చు. వైసీపీ ని ఇరుకున పెట్టొచ్చు. అంతేకాదు.. మరో రెండు కీలక విషయాలు కూడా ఉన్నాయి.
1)253 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని.. సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ సొమ్ము ఎటు నుంచి ఎటు మళ్లింది.. చివరికి ఎవరి ఖాతాకు చేరింది? అనే విషయాలను రాష్ట్ర సర్కారు పరిశీలిస్తే.. వైసీపీ నాయకులకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తిరుమల బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్.. చిన్న అప్పన్న ఖాతాలోనూ.. 4.6 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని సిట్ తేల్చింది. ఈ విషయాన్ని కూడా సర్కారు సద్వినియోగం చేసుకోవచ్చు.
2) సిట్‌లో పేర్కొన్న కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లొచ్చు. ముఖ్యంగా నిబంధనల ను సడలించడం.. చిన్న చిన్న కంపెనీలకు టెండర్లు ఇవ్వడం వంటివి కూడా.. ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలనే చెప్పాలి. కానీ, వీటిని వదిలేసి.. అనవసరంగా రగడకు దిగడం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు కూడా ఇబ్బందిగానే మారిందన్నది ప్రధాన చర్చ. ఇప్పటి వరకు చేతిలో అందుబాటులో ఉన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అది చాలని, వైసీపీకి అదే పెద్ద ఉచ్చుగా మారనుందని అంటున్నారు పరిశీలకులు.
