ఐదు రోజుల్లో ఉచిత బస్సు.. ఆర్టీసీ ఏం చేస్తుందంటే?
మరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కాబోతోంది.
By: Tupaki Desk | 10 Aug 2025 10:31 PM ISTమరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కాబోతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం స్త్రీశక్తి అని పేరు పెట్టింది. 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్త్రీశక్తిని ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు జరుగుతున్న తీరును గమనించి, ఆయా రాష్ట్రాల్లో లోటుపాటులను అధ్యయనం చేసిన ప్రభుత్వం.. అక్కడ ఎదురైన సవాళ్లు ఏపీలో ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులతోపాటు అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటోంది.
ఆ సర్వీసుల్లో ఉచితం నో..!
ఈ నెల 15న మంగళగిరిలో ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ పథకం అందుబాటులోకి రానుందని అంటున్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ , సిటీ బస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించరాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు.
ప్రయాణికుల భద్రత కోసమే..
ఘాట్ రోడ్డులో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా పరిణమించొచ్చని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, కొండ వాలులో తిరిగే బస్సులలో అధిక రద్దీ ఉంటే ప్రమాదాలు జరగొచ్చని సందేహిస్తున్నారు. ఈ కారణంగా రద్దీ నివారణకు ఆయా రూట్లలో తిరిగే బస్స సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు ఇతర రూట్లలో ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా బస్సు సర్వీసులను పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తం 8,458 బస్సుల్లో ఉచితం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11,4499 బస్సులు ఉన్నాయని సమాచారం. ఇందులో సుమారుగా 8,458 బస్సు సర్వీసులను ఉచిత ప్రయాణానికి సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అంటే మొత్తం సర్వీసుల్లో 74 శాతం సర్వీసులో ఉచిత ప్రయాణానికి అనుమతించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఎక్కువగా పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణికులు ఎక్కువగా ఉండనున్నందున సుమారు 5,851 సర్వీసులను సిద్ధం చేశారు. అదేవిధంగా 1610 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, 710 సిటీ బస్, 287 సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణికులను అనుమతిస్తారు.
అదనపు సిబ్బంది నియామకం
ఇక స్త్రీశక్తి పథకం వల్ల మహిళా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో పురుష ప్రయాణికుల రద్దీ తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏదిఏమైనా మొత్తంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అదనపు సిబ్బంది నియామకంపైనా ఆర్టీసీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్ల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి డిపోలో ఏ రోజు అవసరాలకు తగ్గట్టు ఆ రోజు తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. ఆన్ కాల్ డ్రైవర్లుగా చెప్పే వీరిని ఏ జిల్లాకు ఆ జిల్లాలో నియమించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక కొన్ని డిపోల్లో కండక్టర్ల కొరత ఉన్నందున ఓడీలు వేయడంతోపాటు ప్రస్తుతం బస్టాండుల్లో గ్రౌండు డ్యూటీల్లో ఉన్నవారిని తిరిగి బస్ సర్వీసు డ్యూటీలకు వేయనున్నట్లు చెబుతున్నారు.
ఏడాదికి రూ.1942 కోట్ల భారం
మరోవైపు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి పడే భారంపైనా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో పురుషుల వాటా 60 శాతం ఉండగా, మహిళల వాటా కేవలం 40 శాతంగా చెబుతున్నారు. ఉచిత ప్రయాణ పతకం వల్ల పురుష ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి పైగా పెరగొచ్చని భావిస్తున్నారు. పురుష ప్రయాణికులు తగ్గడం ద్వారా ఆర్టీసీకి ఏడాదికి రూ.288 కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదేసమయంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.1453 కోట్లు చెల్లించాల్సివుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో నిర్వహణ ఖర్చులకు మరో రూ.201 కోట్లు అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. అంటే స్త్రీశక్తి పథకం వల్ల ఏడాదికి మొత్తంగా రూ.1942 కోట్ల వెచ్చించాల్సి రావొచ్చని లెక్క కడుతున్నారు.
