జూన్ 2...నవ నిర్మాణ దీక్షలు లేనట్లే !
ఏపీ సంగతి ఏమిటో బహు చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఒక రాష్ట్రంగా ఉంది కానీ ఈ రోజుకీ రాజధాని కోసం పాట్లు పడుతూనే ఉంది.
By: Tupaki Desk | 2 Jun 2025 9:26 AM ISTఏపీ సంగతి ఏమిటో బహు చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఒక రాష్ట్రంగా ఉంది కానీ ఈ రోజుకీ రాజధాని కోసం పాట్లు పడుతూనే ఉంది. అది ఒక ఎత్తు అయితే ఏపీ ఫార్మేషన్ డే ఏమిటి ఎపుడు అన్నది కూడా తెలియకుండానే కాలం గడిపేస్తోంది. నిజానికి ఒక రాష్ట్రానికి ఫార్మేషన్ డే అన్నది కచ్చితంగా ఉంటుంది. కానీ ఏపీ విషయంలో చాలా డేట్లు ఉన్నాయి. వాటి వెనక వివాదాలు ఉన్నాయి. అందుకే దేనిని నిర్ణయించాలన్నది కూడా రాజకీయం అయిపోతోంది.
ఉమ్మడి ఏపీ విభజన తరువాత 2014 జూన్ 2 న అపాయింట్ డే గా నిర్ణయించారు. దాంతో తెలంగాణా అన్న కొత్త రాష్ట్రం ఆ రోజు నుంచి ఆవిర్భవించింది. అలా ఫార్మేషన్ డే ని వారు జరుపుకుంటున్నారు. ఏపీ విషయానికి వస్తే విభజన ఎటూ కోరుకోలేదు. దాంతో జూన్ 2 ఏపీ ఫార్మేషన్ డే కాదు బలవంతంగా విడగొట్టబడిన రోజు అని ఆంధ్ర మేధావులు పెద్దలు అంతా అంటూ వచ్చారు.
దాంతో ఏపీకి 2014 తరువాత విభజన ఏపీకి తొలి సీఎం అయిన చంద్రబాబు జూన్ 2 నుంచి జూన్ 9 వరకూ నవ నిర్మాణ దీక్షలు అని చేయించేవారు. విడిపోయిన ఏపీ పట్టుదలతో మళ్ళీ పూర్వ వైభవం సాధించాలని అందుకోసం ప్రజలంతా కార్యోన్ముఖులై ఏపీని అభివృద్ధి చేసుకోవడానికి పునరంకితం కావాలని బాబు అప్పట్లో దీక్షలు చేయించేవారు.
అయితే దీక్షలు వరకూ ఓకే అయినా ఏపీ ఆవిర్భావ దినోత్సవాలు మాత్రం 2014 నుంచి 2019 మధ్యలో బాబు చేయలేకపోయారు. ఉమ్మడి మద్రాస్ నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పాటు అయింది కాబట్టి ఆ రోజు కరెక్ట్ అని అలాగే చేయాలని చాలా మంది సూచించారు.
అలా కాదు అనుకుంటే అప్పటి ఆంధ్ర రాష్ట్రం నాటి హైదరాబాద్ స్టేట్ రెండూ విలీనం అయి ఉమ్మడి ఏపీగా ఆవిర్భవించిన నవంబర్ 1నే ఏపీ ఫార్మేషన్ డే గా నిర్ణయించాలని కోరిన వారూ ఉన్నారు. దీనికి కూడా లాజిక్ ఉంది. ఆంద్రప్రదేశ్ అలాగే ఉంది విడిపోయింది తెలంగాణా కాబట్టి వారికి జూన్ 2వ తేదీ ఫార్మేషన్ డే అవుతుంది అని వాదించేవారూ ఉన్నారు.
అయితే ఈ రెండు డేట్లను బాబు ప్రభుత్వం అప్పట్లో పరిశీలించలేదు. దాంతో అయిదేళ్ళ పాటు ఫార్మేషన్ డే లేకుండానే ఏపీ ఉంది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవంబర్ 1నె ఫార్మేషన్ డేగా నిర్ణయించి అయిదేళ్ళ పాటు జరిపింది. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఫార్మేషన్ డే విషయంలో ఎటూ తేల్చలేదు.
అంతే కాదు నవంబర్ 1న చంద్రబాబు దీపం 2 పధకం ప్రారంభించడానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి వచ్చారు. ఆ సభలో కూడా ఆయన ఎక్కడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే జూన్ 2 న తెలంగాణా ఫార్మేషన్ డే ఇపుడు జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలను కూడా ప్రకటించలేదు. దాంతో ఏపీ సంగతి ఏమిటో అని అంతా భావిస్తున్నారు.
కనీసం ఈ ఏడాది అయినా నవంబర్ ఒకటవ తేదీని ఆవిర్భావ దినోత్సవ దినంగా గుర్తించి వేడుకలు జరపాలని అంతా కోరుతున్నారు. జూన్ 2 ని మాత్రం కనీసంగా తలచేందుకు ఏపీ వాసులు ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు. చూడాలి మారి కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో.
