Begin typing your search above and press return to search.

ఏపీలో ఇప్పటి స్థానిక రచ్చ డీఎన్ ఏ ఏంటి?

నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయస్థాయిలోనూ చర్చగా మారుతున్నాయి.

By:  Garuda Media   |   24 Oct 2026 4:00 PM IST
ఏపీలో ఇప్పటి స్థానిక రచ్చ డీఎన్ ఏ ఏంటి?
X

గతానికి వర్తమానానికి వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో మరపు అన్నది జీవనవిధానంగా మారింది. గతంలో ఏళ్ల క్రితం నాటి ఉదంతాలు కూడా గుర్తుంచుకునే ప్రజలు తీరు మారింది. గడిచిన ఇరవై ఏళ్లలో వచ్చిన మార్పులతో ఎప్పటికప్పుడు కొత్త విషయాల్నే తప్పించి.. పాత విషయాల్ని ఇట్టే మర్చిపోతున్న పరిస్థితి. నెల క్రితం జరిగిన పరిణామాల్నే మరిచిపోతూ.. తర్వాతి గంటలో వచ్చే ఎక్సైట్ మెంట్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఈ కారణంగానే రెండుమూడేళ్ల క్రితంనాటి ఘటనలు సైతం అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన ఉదంతాలుగా మారిపోతున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయస్థాయిలోనూ చర్చగా మారుతున్నాయి. పలువురు బిహార్ పరిస్థితులతో పోలుస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులా? అని కొందరు విస్తుపోతుంటే.. మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వారిలో అత్యధికులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాల్ని మర్చిపోతున్నారు.

కోట్లాటలు.. ఘర్షణలు.. దౌర్జన్య ఘటనలు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునేవే అయినప్పటికి.. ఎన్నికల వేళ హింస ఎన్ని రకాలుగా చేయొచ్చు.. అసలు నామినేషన్ వేయకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను నిలువరించటం ఎలా? ఒకవేళ నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే.. వారిని ఎలా అడ్డుకోవాలి? లాంటి విషయాన్ని ఏపీ ప్రజలకు అరటిపండు వొలిచినట్లుగా వైసీపీ నేతలు, క్యాడర్ అందరికి అర్థమయ్యేలా చేసింది. అంతేకాదు.. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ అధిక్యతను ప్రదర్శించటానికి ఏమేం చేయాలి? అన్న విషయంపైనా అవగాహన వచ్చేలా చేసింది.

ఇప్పుడైతే మా చేతుల్లో అధికారంలో లేదు కానీ.. మేం పవర్ లోకి వస్తే.. అంతకంతకూ బదులు తీర్చుకుంటామన్న శపధాలు అప్పట్లో పలువురు చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ కలిసి తాజా రచ్చకు కారణంగా చెప్పాలి. ఇంత దారుణమా? బుగ్గలు నొక్కుకుంటున్న పలువురు.. గతాన్ని సులువుగా మర్చిపోతున్నారు. అయితే.. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకు చేతకానిది.. ఇప్పుడు వైసీపీకి చేతనవుతున్నది ఒక్కటే. విక్టిం కార్డును జాతీయస్థాయిలో ప్రదర్శించటమే కాదు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఔరా? అనుకునేలా చేయటం.

అదే సమయంలో అప్పట్లో జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాల్ని న్యాయస్థానాలకు అర్థమయ్యేలా చేయటంలో టీడీపీ.. జనసేనలు ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. నిజానికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం కోసం అనుసరించిన విధానాల్ని చూసి.. ఇన్ని విధాలుగా చేయొచ్చా? అని విస్మయానికి గురైన పరిస్థితి. నామినేషన్ వేసేందుకు వచ్చే వారిని బెదిరించటం.. దాడులకు పాల్పడటమే కాదు.. గంజాయి.. అక్రమ మద్యం నిల్వ లాంటి తప్పుడు కేసులు బనాయించటం.. అక్రమ అరెస్టులకు దిగటం లాంటివెన్నో అప్పట్లో జరిగాయి. చివరకు పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు ఆస్తిపన్ను బకాయిల్ని చెల్లించేందుకు వెళ్లినా అప్పటి అధికారులు తీసుకునేవారు. అంతేనా.. నో డ్యూ సర్టిఫికేట్లు జారీ చేయకుండా అడ్డుకోవటం.. ప్రత్యర్థి పార్టీల నుంచి నామినేషన్ పత్రాల్ని లాక్కుని చించేయటం లాంటివెన్నో.

అప్పట్లో వైసీపీ నేతలు అలా చేశారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పార్టీలు అలా చేయాలని మేం చెప్పటం లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నదే మా అభిమతం. కాకుంటే రోగానికి మూలం తెలిస్తే.. చికిత్స చేయటం సులువు. అదే సూత్రంలో ఇప్పటి రచ్చకు మూలాలు ఎక్కడున్నాయి? అన్నది చూస్తే.. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉదంతాలే అన్నది కనిపిస్తుంది.

నామినేషన్ పత్రాల్ని లాక్కొని చించేస్తుంటే.. అధికారులు, పోలీసులు చేష్టలుడిగా చూస్తుండిపోవటం ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ప్రశ్నలు అప్పట్లో వేసే ధైర్యం కూడా ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అందుకే అంటారు మంచి అబ్బటం కష్టం కానీ చెడు అలవాట్ల నుంచి స్ఫూర్తి పొందటం చాలా సులువు. ఇప్పటి ఏపీలోని రాజకీయ రోగానికి మూలం గతం. అలా అని.. దానిని అంతేలా కొనసాగిస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారటం ఖాయం. అదే జరిగితే ఎన్నికల ప్రక్రియ మొత్తం బలవంతుడి చేతిలో కీలుబొమ్మలా మారుతుంది. అందుకే.. రచ్చ రోగానికి చికిత్స అవసరం. అందుకు గతాన్ని..వర్తమానాన్ని కలిపి ఒకేసారి చికిత్స చేస్తే.. భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారే వీలుంది. కాదంటారా?