ఇదే మంచి సమయం.. బాబు గారూ!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీ అత్యంత కీలకంగా మారింది.
By: Tupaki Desk | 3 May 2025 7:51 PM ISTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీ అత్యంత కీలకంగా మారింది. అటు కేంద్రంలో తీసుకోబోయే నిర్ణయాలను పరిశీలించినా.. వచ్చే తమిళనాడు ఎన్నికలను లెక్కలోకి తీసుకు న్నా.. చంద్రబాబు సహా పవన్ కల్యాణ్ అవసరం మోడీకి అత్యంత కీలకం. ఏపీలో అభివృద్ధిని చూపించి తమిళనాడులో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో బీజేపీ ఉందన్నది నిర్వివాదాంశం. అందుకే.. ఎనలేని ప్రేమ.. ఎక్కడా లేని ఆప్యాయత మోడీ కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సమయానికి మించిన టైం.. చంద్రబాబుకు దక్కదన్నది మేధావులు, రాజకీ య వర్గాలుకూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు గొంతెమ్మ కోరికలేవీ కోరనక్కర లేదు. రాష్ట్రా నికి న్యాయ బద్ధంగా రావాల్సిన వాటిని రాబట్టుకుంటే చాలని అంటున్నారు. జగన్ మాదిరిగా చంద్రబాబు పై కేసులు.. కోర్టులు అనే మాట లేదు కాబట్టి.. వ్యక్తిగత అంశాలకు తావులేదని చెబుతున్నారు. ఉన్నదంతా .. రాష్ట్ర ప్రయోజనమే.
దీని కోసం చంద్రబాబు కృషి చేస్తే.. కొంచెం కష్టపడితే.. కేంద్రం మరింత దూకుడుగా సాయం చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మోడీ తాజాగా ఏపీకి ఎంతో ఇచ్చామని చెప్పారు. కానీ, నిజానికి బీహార్‌తో పోల్చుకుంటే.. ఏపీకి ఇచ్చింది.. రూపాయిలో పావలా వంతు. అలాగని ఘర్షణ వాతావరణం సృష్టించుకోమని కూడా చెప్పడం లేదు. రాష్ట్ర అవసరాలకు వీలైనంత వరకు సాయం కోరడంలో తప్పులేదు. అదేసమయంలో వీలు కాని ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి.. వాటిని పక్కన పెట్టి.. మిగిలిన వాటిపై దృష్టి పెడితే.. సాధ్యమైనంత వరకు కేంద్రం నుంచి సాయం చేకూరుతుంది.
ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నట్టుగా.. మోడీ మనసు మారకముందే.. కేంద్రంలో ఆయన ఇతర పక్షాలతో బలోపేతం కాకముందే.. రాష్ట్రానికి అవసరమైన వాటిని సాధించుకునే అవకాశం ఉంది. పోలవరం పూర్తి, రాజధాని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, పంచాయతీలకు నిధులు.. 15వ ఆర్తిక సంఘం ప్రతిపాదిత నిధులు ఇలా.. అనేకం ఉన్నాయి. వాటిని రాబట్టుకుని రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రస్తుతం ఏడాది పాటు చంద్రబాబుకు అవకాశం ఉందని చెబుతున్నారు.
