నియోజకవర్గాల పునర్విభజన.. కూటమికి ఇబ్బందేనా.. ?
దీంతో అప్పట్లో 2024లో కచ్చితంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయని అందరూ భావించారు. కానీ 2021 లో జనాభా లెక్కలు చేయకపోవడం..
By: Tupaki Desk | 28 July 2025 10:00 AM ISTరాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి వివాదంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాలను పునర్ విభజిస్తారని.. 50 వరకు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయని రాజకీయ పార్టీలు ఆశపెట్టుకున్నాయి. వాస్తవానికి 2014- 19 మధ్య సీఎం చంద్రబాబు ఉన్నప్పుడే నియోజకవర్గాల పునర్విభజనపై ఆయన గట్టిగానే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ వద్దకు ఒకటికి రెండుసార్లు తిరిగి నియోజకవర్గాల విభజన అంశాన్ని ప్రస్తావించారు. అయితే అప్పట్లో 2021 జనాభా లెక్కల అనంతరం ఇది జరుగుతుందని, కాబట్టి 2024 ఎన్నికలకే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు.
దీంతో అప్పట్లో 2024లో కచ్చితంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయని అందరూ భావించారు. కానీ 2021 లో జనాభా లెక్కలు చేయకపోవడం.. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం 2027 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 2027లో జనాభా లెక్కలు సేకరించిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి దాని ప్రకారం మాత్రమే నియోజకవర్గాలను పునర్ విభజిస్తారు అన్నది స్పష్టమైనది.
దీనిని బట్టి 2029 ఎన్నికలకు కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం కనిపించడం లేదు. దాదాపు 2034 ఎన్నికల వరకు కూడా నాయకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాజకీయంగా కూటమి పార్టీలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో 21 స్థానాలను జనసేనకు, 10- 15 అసెంబ్లీ స్థానాలను బిజెపికి ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో టీడీపీ నుంచి చాలామంది సీనియర్ నాయకులు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది, ఇది అసంతృప్తికి దారి తీసింది.
అయితే, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వం రాగానే పదవులు ఇస్తామని ఆశ చూపి వారిని బుజ్జగించారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలకు పునర్ విభజన జరుగుతుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది తగ్గుతుందని, ఒకవేళ జనసేనకు మరిన్ని సీట్లు అదనంగా ఇచ్చిన తమకు ఇబ్బంది ఉండదని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. కానీ ఈ ప్రక్రియ ఆలస్య కావడంతో వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు హీనపక్షం 40 సీట్లు ఇచ్చినా బిజెపి కి మరో 15 సీట్లు ఇచ్చినా ఈ వార టిడిపికి కోతపడుతుంది. దీనివల్ల మరింత మంది నాయకులను తప్పించాల్సి ఉంటుంది.
ఇది అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. పైగా గతంలో సీట్లు త్యాగం చేసిన వారికి ఇంకా కొంత మేరకు న్యాయం చేయకపోవడం వారంతా ఎదురు చూస్తూ ఉండటం కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగకపోవడం అనేది కూటమికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక, వైసీపీకి ఇబ్బందులు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఎవరితోనో పొత్తులు పెట్టుకునే పరిస్థితి లేదు.
పైగా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని జగన్ ఓడిపోయిన తర్వాత కూడా చెబుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్ విభజన అంశం ఒక కూటమికి మాత్రమే ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన వచ్చే ఎన్నికల నాటికి 40 నుంచి 50 టికెట్లు అడిగే అవకాశం ఉంది. బిజెపి కూడా పుంజుకుని.. హీనపక్షం 15 నుంచి 20 టికెట్లు ఆశించే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే టీడీపీ కోత పడితే ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి చంద్రబాబు ఈ సమస్యను ఏ విధంగా నెట్టుకొస్తారనేది చూడాలి.
