ఏపీ ఫ్లాష్ బ్యాక్ : రాజధాని రగడ ఈనాటిది కాదు !
ఆంధ్ర ప్రదేశ్ ని ఒక విధంగా శాపగ్రస్థగా చరిత్రకారులు విశ్లేషిస్తారు. దానికి కారణం గత ఎనభై ఏళ్ళుగా ఎన్నో ఒడుదుడుకులు పడుతూ లేస్తూ ఏపీ సాగుతోంది.
By: Satya P | 11 April 2026 5:00 AM ISTఆంధ్ర ప్రదేశ్ ని ఒక విధంగా శాపగ్రస్థగా చరిత్రకారులు విశ్లేషిస్తారు. దానికి కారణం గత ఎనభై ఏళ్ళుగా ఎన్నో ఒడుదుడుకులు పడుతూ లేస్తూ ఏపీ సాగుతోంది. ఈ మధ్యలో ఎన్నో వాదాలు వివాదాలు రాజధాని కోసం రచ్చలు, విభజన వాదాలు ఇలా ఏపీ అన్ని విధాలుగా నష్టపోతూనే ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఏపీ విడిపోవడం మీద కూడా ఒక చర్చ ఉంది. సానుకూలంగా మాట్లాడేవారు చెప్పేది ఏమిటి అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నామని. మరో వాదన ఏమిటి అంటే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మద్రాస్ రాజధానిని అభివృద్ధి చేయడంలో ఏపీలోని మొత్తం ప్రజల శ్రమ ఉందని అయినా సరే రాత్రికి రాత్రి మద్రాస్ రాజధానిని వదిలేసి రావడం బాధాకరం అని. ఇది ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయినా రాజధాని కోసం నాటి నుంచి నేటి వరకూ రచ్చ రావణ కాష్టంగా సాగడమే ఏపీ పాలిట విషాదం అని చరిత్రను అధ్యయనం చేసిన వారు చెప్పే మాట.
ఆనాడు ఏమి జరిగింది :
ఇక చూస్తే 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. దాని కంటే ముందు 1952లో అమరజీవి పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష చేపట్టి ఆ ఏడాది డిసెంబర్ 16న అమరుడు అయ్యారు. ఆ మీదట ఉవ్వెత్తిన లేచిన నిరసన జ్వాలాలు భారీ ఉద్యమం ఫలితంగా కేంద్రంలోని పండిట్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని హుటాహుటిన ప్రకటించాల్సి వచ్చింది. ఆ ప్రకటనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మధ్య పది నెలల వ్యవధిలో ఏపీకి కొత్త రాజధాని ఎక్కడ అన్న దాని పైన అతి పెద్ద చర్చ సాగింది. అది కూడా రాజకీయ రచ్చగానే మారింది.
వివాదాస్పదంగానే :
ఇక 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని ఎంపిక ఒక వివాదాస్పద అంశంగా మారడమే కాదు ఏపీలో ఉన్న ఉత్తరాంధ్రా కోస్తా రాయలసీమ ప్రాంతాల మధ్య ఒక ఏకాభిప్రాయానికి రావడానికి కూడా వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి అన్నది చరిత్ర చెప్పే విషయం. ఆనాడు కూడా విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని కోస్తా వాసుల నుంచి అక్కడ ఆనాడు బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ నుంచి డిమాండ్ వచ్చింది. అయితే రాయలసీమలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మాత్రం కర్నూల్ రాజధానిగా ఉండాలని పట్టుబట్టారు. ఉత్తరాంధ్రాలో సైతం కొందరు విశాఖపట్నం రాజధానిగా చేయాలని కోరడం జరిగింది. ఇలా నెలల తరబడి జరిగిన ఈ రాజకీయ రచ్చకు ఎట్టకేలకు ముగింపుగా కర్నూలును రాజధానిగా ఎంచుకున్నారు. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం అని చెబుతారు. అయితే ఈ నిర్ణయం రాజకీయ సంఘర్షణకు నిరసనలకు దారితీసిందని పేర్కొంటారు. కర్నూలు నుంచి రాజధానిని మార్చాలని కోస్తా నాయకులు అప్పట్లో డిమాండ్ చేయగా కర్నూలును విడిచిపెడితే రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా కోరుతామని ఆ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు హెచ్చరించారని సైతం అంటారు.
రాజకీయ రగడగానే :
ఇక ప్రధాని పండిట్ నెహ్రూ స్వయంగా కర్నూల్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ప్రారంభించారు. అంతే కాదు ఆంధ్ర రాష్ట్ర తొలి అవతరణ దినోత్సవాలలో ఆయన పాల్గొని అంతా కలసి ఉండాలని సందేశం ఇచ్చి వెళ్లారు. అయినా సరే రాజకీయ సంఘర్షణలు మాత్రం అప్పట్లో చల్లారలేదు. దాంతో కర్నూలు రాజధాని అన్న నిర్ణయం వివాదాస్పదమైందని చెబుతారు. 1953 నవంబర్ 5న అయితే దీని మీద కోస్తా ప్రాంతాలలో భారీ ఆందోళనలు సాగాయి. కర్నూలులో ఉన్న రాజధానిని గుంటూరు-విజయవాడ ప్రాంతానికి మార్చాలని డిమాండ్లు సైతం వచ్చాయి.
రాజీనామాల హెచ్చరికలు :
ఇక ఆనాడు ఉన్న పార్టీలలో కాంగ్రెస్ కర్నూల్ రాజధానికి అనుకూలంగా ఉండడమే కాదు ఏర్పాటు చేయగా ప్రతిపక్షంలో ఉన్న కృషికర్ లోక్ పార్టీ అయితే కర్నూల్ కాదు తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలని అన్ని విధాలుగా అది అనుకూలమైన ప్రాంతమని వాదించింది. ఇక కోస్తాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న కమ్యూనిస్టులు విజయవాడలోనే రాజధాని పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా రాజధాని రగడ సాగుతొండగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనరు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కర్నూల్ నుంచి రాజధానిని తరలిస్తే తాము రాజీనామాలు చేస్తామని హెచ్చరించారని చెబుతారు.
విశాఖ రాజధానిగా :
ఇలా ఏపీ రాష్ట్రం ఏర్పాటుతోనే రాజధాని వివాదం మొదలవడమే కాదు, చాలా నెలల పాటు సాగింది. అంతే కాదు నాటి ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల నిరసనలు ఆందోళనలు జరిగాయని అంటారు. ఇలా వివాదం సాగుతున్న క్రమంలోనే విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు కర్నూల్ రాజధానిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో పెట్టిన కీలకమైన తీర్మానం నెగ్గింది. దాంతో 1956 మే నెల నుంచి విశాఖని రాజధానిగా చేసుకుని పాలన చేయాలని కూడా దాదాపుగా నిర్ణయించారు. అయితే ఇంతలోనే 1956లో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దాంతో కర్నూలు రాజధానిని ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు.
