అన్నమయ్య జిల్లాలో సంచలన మార్పులు.. కేబినెట్ భేటీలోనే మంత్రి కన్నీరుమున్నీరు
ఏపీలో జిల్లాల పునర్విభజన కార్మిక శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కంట నీరు పెట్టించింది.
By: Tupaki Political Desk | 29 Dec 2025 3:57 PM ISTఏపీలో జిల్లాల పునర్విభజన కార్మిక శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కంట నీరు పెట్టించింది. ఆయన సొంత నియోజకవర్గమైన రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. తాజా మార్పు చేర్పులతో రాయచోటి జిల్లా కేంద్రం అర్హతను కోల్పోయింది. ఈ పరిణామం స్థానిక శాసనసభ్యుడైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాజకీయంగా తీవ్ర ఇబ్బందికరమని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తిన్న మంత్రి మండిపల్లి మంత్రివర్గ సమావేశంలోనే కన్నీరుపెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ సమావేశం తర్వాత కూడా ఆయన కంట నీరు పెట్టుకుంటూ బయటకు రావడాన్ని మీడియా చూపించింది. ఇక ప్రస్తుతం ఉన్న జిల్లాలను పునర్విభజించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 28 చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాను సమూలంగా మార్చేవేసి మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయనుంది. అంతేకాకుండా తిరుపతి జిల్లాలోనూ కొన్ని మార్పులు చేసింది. దీంతో కొత్త ఏడాదిలో జిల్లాల స్వరూపంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని అంటున్నారు. నిజానికి మార్కాపురం, మదనపల్లె, పోలవరం కేంద్రాలుగా కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. గత నెలలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తీసుకున్న తుది నిర్ణయంతో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు, అన్నమయ్య జిల్లాలో మార్పులు చేయాలని నిర్ణయిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది.
మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలను యథాతథంగా మంత్రి మండలి ఆమోదించింది. ఇదే సమయంలో కొత్తగా ప్రతిపాదించిన మదనపల్లె జిల్లా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోనే ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని నిర్ణయించినప్పటికీ అన్నమయ్య జిల్లాగానే పిలవాలని ప్రభుత్వం భావించింది. ఇక ఈ జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జల్లాలో విలీనం చేయాలని తీర్మానించింది. అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. మరోవైపు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని ప్రజల డిమాండు మేరకు నెల్లూరు జిల్లాలో విలీనం చేసింది.
ఈ మార్పులతో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు అంశమే పెద్ద రాజకీయ దుమారం రేగేలా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లోనే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని లేదా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను మార్చాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు.కానీ, అప్పటి ప్రభుత్వ పెద్దలు రాయచోటకే పెద్దపీట వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం జిల్లా కేంద్రం మార్చాలని నిర్ణయించడంతో ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు. ప్రధానంగా స్థానిక శాసనసభ్యుడు, మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డికి ఈ పరిణామం రాజకీయంగా పెను సవాలు కాబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా కేంద్రం మార్పుపై తన ఆందోళన, ఆవేదనను మంత్రి మండిపల్లి కేబినెట్ సమావేశంలోనే వ్యక్తం చేసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు చెప్పిన సమయంలో మంత్రి కంట తడి పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సాంకేతిక కారణాల వల్ల జిల్లా కేంద్రం మార్చాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను ఓదార్చినట్లు చెబుతున్నారు. రాయచోట అభివృద్దికి తనది హామీగా చెప్పిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని అభయమిచ్చారని అంటున్నారు. అయినప్పటికీ మంత్రి మండిపల్లి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారని, మంత్రి మండలి సమావేశం నుంచి బయటకు వస్తూ కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారు. మంత్రి కంట నీరు పెట్టుకున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
